Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు చుక్క‌లు చూపిస్తోంది

By:  Tupaki Desk   |   10 Nov 2016 10:28 PM GMT
కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు చుక్క‌లు చూపిస్తోంది
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆఘ‌మేఘాల మీద 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చడంతో జిల్లాల స్వరూపం మారింది. అయితే ఈ భౌగోళిక మార్పు ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నాయ‌కుల‌కు చాలానే చిక్కుల‌ను తెచ్చిపెట్టిన విష‌యం తెలిసిందే. సొంత ఊరు ఒక‌చోట‌, ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం అనేక జిల్లాలోకి చేరిపోవ‌డం, జిల్లా ప‌రిధి త‌గ్గిపోవ‌డం వంటివి ఉదాహ‌ర‌ణ‌లు. అయితే భవిష్య‌త్తులో నాయ‌కులు కావాల‌నుకునే వారు సైతం ఇదే త‌ర‌హా స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పట్ట‌భ‌ద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో బ‌రిలో నిల‌వాల‌నుకుంటున్న నాయ‌కులు ఈ విధంగా చ‌ర్చించుకుంటున్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం వ‌ల్ల కొత్త జిల్లాల ఏర్పాటుతో పట్ట‌భ‌ద్రుల, ఉపాధ్యాయల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి (కౌన్సిల్) పోటీ చేసే అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. భవిష్యత్తులో పోటీ చేయవచ్చన్న భావనతో తమ నియోజకవర్గాల (జిల్లాల) పరిధిలో స‌దరు నాయ‌కులు మంచి పరిచయాలు పెంచుకున్నారు. కానీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణ‌యంతో 31 జిల్లాలుగా మార్చడంతో జిల్లాల స్వరూపం మారిపోయింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేత‌ల్లో క‌ల‌వ‌రం మొదలైంది.

గతంలో మూడు జిల్లాల్లో పర్యటిస్తే సరిపోయేదని, ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరగడంతో తాము పెరిగిన, అంటే కొత్తగా వెలిసిన జిల్లాల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవాల్సి ఉంటుందని స‌ద‌రు ఆశావ‌హ అభ్యంర్థులు అంటున్నారు. లోగడ మూడు జిల్లాల పరిధి ఇప్పుడు తొమ్మిది జిల్లాలుగానో లేక తొమ్మిదిన్నర జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు అభ్యర్థులూ తమ నియోజకవర్గాల (అంటే జిల్లాల) పరిధి తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. గతంలో ఉన్న ఒక జిల్లా ఇప్పుడు మరో జిల్లాలో కొంత భాగమైంది. కలగాపులగం కావడంతో చాలా జాగ్రత్తగా కొత్త జిల్లాల సంగతిని పక్కన పెట్టి, పాత జిల్లాల సరిహద్దులను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల‌యిన పట్ట‌భ‌ద్రులను, ఉపాధ్యాయులను కలిసి ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మూడు జిల్లాలు చొప్పున ఉండే పట్ట్భద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో కలవడం వల్ల ప్రచారంలో చాలా అయోమయంగా ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల, జిల్లాల సరిహద్దులను తెలియజేస్తూ, సరిహద్దు గ్రామాల విషయంలో తగాదా లేకుండా, ఆ గ్రామాలు ఏ జిల్లాల పరిథిలోకి వస్తాయో రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది. జిల్లాల స్వరూపం మారినా, ఎన్నికల కమిషన్ వద్ద పాత నియోజకవర్గాల (జిల్లాల) ప్రకారమే ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి వచ్చిన చిక్కేమి లేదని అధికారులు చెబుతున్నా, అభ్యర్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుండ‌టం కొస‌మెరుపు.