Begin typing your search above and press return to search.

ట్రంప్ కు నో అంటూ 32 లక్షల మంది సంతకాలు

By:  Tupaki Desk   |   13 Nov 2016 5:48 AM GMT
ట్రంప్ కు నో అంటూ 32 లక్షల మంది సంతకాలు
X
ఊహించని రీతిలో.. అన్నీ మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా.. సంచలన రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ విజయం సాధించిన వెంటనే.. ఆ పార్టీకి చెందిన వారు సంబరాలు చేసుకోవటానికి సంబంధించి పెద్దగా వార్తలు రానప్పటికీ.. ఆయన ఎన్నికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకోవటం తెలిసిందే.

తాను విజయం సాధించిన తర్వాత కూడా తనపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడా. అయినప్పటికీ.. ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మాత్రం తగ్గటం లేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తగడంటూ చేపట్టిన నిరసనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. పోర్ట్ ల్యాండ్.. ఒరెగాన్ ప్రాంతాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ట్రంప్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు.

ట్రంప్ కు వ్యతిరేకంగా పిటీషన్ ను తయారు చేశారు. ట్రంప్ ను కాదని హిల్లరీని అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని.. చట్టసభకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకోవాలంటూతయారు చేసిన ఒక పిటీషన్ మీద 32 లక్షల మంది సంతకాలు చేశారు. అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు ఎలక్ట్రోల్ కాలేజీ సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం ద్వారా.. హిల్లరీని ఎన్నుకోవాలని కోరుతున్నారు.

వాషింగ్టన్.. శాన్ ఫ్రాన్సిస్కో.. మియామి.. అట్లాంటా.. కాలిఫోర్నియా.. లాస్ ఏంజెలెస్.. డెట్రాయిట్.. కాన్సాస్.. అనియోవా.. షికాగో ప్రాంతాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. నిరసనకారులు చేస్తున్న నిరసనలు ఏ స్థాయికి చేరాయంటే కొన్నిచోట్ల లాఠీ ఛార్జీలు జరిగాయి. కొన్నిచోట్ల భాష్పవాయుగోళాల్ని వినియోగించిన పరిస్థితి. కొన్ని దుకాణాలపై నిరసనకారులు దాడులు చేపట్టం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/