Begin typing your search above and press return to search.

ఇందిరా గాంధీ శ‌రీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లెన్ని?

By:  Tupaki Desk   |   1 Nov 2016 4:36 AM GMT
ఇందిరా గాంధీ శ‌రీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లెన్ని?
X
మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ హ‌త్య జ‌రిగి నిన్న‌టికి స‌రిగ్గా 32 ఏళ్లు. శ‌త్రువుల నుంచి ఇందిర‌ను కాపాడేందుకు నియోగించిన సెక్యూరిటీ గార్డులే ఆమెను పొట్ట‌న‌బెట్టుకున్నారు. ఇందిర సెక్యూరిటీ కోసం సిక్కు గార్డుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన అత్యాధునిక మెషీన్ గ‌న్ల నుంచి దూసుకువ‌చ్చిన బుల్లెట్లు ఆమె శ‌రీరాన్ని ఛిద్రం చేసేశాయి. ఫ‌లితంగా నిల‌బ‌డ్డ చోటే ఇందిరా గాంధీ కుప్ప‌కూలిపోయారు. కాల్పులు జ‌రిగిన త‌ర్వాత ప‌దే ప‌ది నిమిషాల్లో ఆసుప‌త్రికి త‌ర‌లించగా, ఆమె అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. అయితే ఇందిర మ‌ర‌ణాన్ని మాత్రం అధికారికంగా మ‌ధ్యాహ్నానికి గాని ప్ర‌క‌టించ‌లేదు. ఆ స‌మ‌యంలో ఇందిరా గాంధీ త‌న‌యుడు రాజీవ్ గాంధీ ఢిల్లీలో లేరు. ఇందిర చ‌నిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన గంట‌కు గాని ఆయ‌న ఢిల్లీకి చేరుకోలేక‌పోయారు. ఇక నాడు రాష్ట్ర‌ప‌తిగా ఉన్న జ్ఞాని జైల్ సింగ్ కూడా విదేశీ ప‌ర్యట‌న‌లో ఉన్నారు. ఇందిర మ‌ర‌ణ వార్త తెలుసుకున్న ఆయ‌న కూడా సాయంత్రానికి గాని తిరిగి రాలేక‌పోయారు.

ఇక నాడు హోంశాఖ మంత్రిగా ఉన్న పీవీ న‌ర‌సింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఇందిర హ‌త్య‌కు ప్ర‌తీకారంగా జ‌రిగిన సిక్కుల ఊచ‌కోత‌ను ఆపేందుకు మాత్రం ఆయ‌న అంత‌గా ఆస‌క్తి చూప‌లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. దాదాపు 48 గంట‌ల పాటు జ‌రిగిన సిక్కుల ఊచ‌కోత‌లో అధికారిక లెక్క‌ల ప్ర‌కారం... ఒక్క ఢిల్లీలోనే 2,100 మంది సిక్కులు ప్రాణాలు కోల్పోగా - మొత్తం మీద 2,800 మంది చ‌నిపోయారు. ఇక అన‌ధికారిక లెక్క‌ల‌ను చూస్తే ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఈ లెక్క‌ల ప్ర‌కారం ఢిల్లీలో 3 వేల మంది సిక్కులు చ‌నిపోగా - మొత్తం మీద 8 వేల మంది దాకా సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. అంతా జ‌రిగిపోయిన త‌ర్వాత రంగంలోకి దిగిన సైన్యం మ‌రింత మంది సిక్కులు చ‌నిపోకుండా అల్ల‌ర్ల‌ను అణచివేసింది.

అయినా నాడు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను ఓ వ‌రుస క్ర‌మంలో మ‌న‌నం చేసుకుంటే... 1984 అక్టోబ‌రు 31న ఉద‌యం 9.20 గంట‌ల‌కు ఇందిరా గాంధీ త‌న అధికారిక నివాసంలోని వ‌సారాలో ప‌చార్లు చేస్తుండ‌గా - ఆమెకు అంగ‌ర‌క్ష‌కులుగా ఉన్న ఇద్ద‌రు సిక్కు సెక్యూరిటీ గార్డులు బియాంత్ సింగ్‌ - స‌త్వంత్ సింగ్‌ లు ఆమెపై బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. వారి చేతుల్లోని మెషీన్ గ‌న్ల నుంచి ఏకంగా 30 తూటాలు దూసుకురాగా - వాటిలో కేవ‌లం మూడు బుల్లెట్లు మాత్రమే గురి త‌ప్పాయి. మిగిలిన 27 బుల్లెట్లు కూడా ఇందిరా గాంధీ శ‌రీరంలోకి దూసుకెళ్లాయి. వీటిలో 20 బుల్లెట్లు ఇందిరా గాంధీ శ‌రీరంలోని ఓ ప‌క్క నుంచి లోప‌లికి దూసుకెళ్లి మ‌రోప‌క్క నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాయి. ఇక మిగిలిన ఏడు బుల్లెట్లు మాత్రం ఇందిరా గాంధీ శ‌రీరంలోనే ఉండిపోయాయి. ఇది జ‌రిగిన వెంట‌నే స్పందించిన మిగిలిన సిబ్బంది ప‌దే ప‌ది నిమిషాల్లో ఇందిర‌ను ఎయిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆమె చ‌నిపోయారు. అయితే ప్ర‌ధాని హోదా క‌లిగిన ఇందిరా గాంధీ మ‌ర‌ణాన్ని అధికారికంగా ప్ర‌క‌టించేందుకు వైద్యుల‌కు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. మ‌ధ్యాహ్నం 2.20 గంట‌ల‌కు ఇందిర చ‌నిపోయిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించ‌గా, సాయంత్రం ఆమె మ‌ర‌ణాన్ని దూర‌ద‌ర్శ‌న్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇక ఉద‌యం ఇందిర‌పై కాల్పులు జ‌రిగే స‌మ‌యానికే ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిపోయారు. త‌ల్లి మ‌ర‌ణ వార్త తెలుసుకున్న తిరిగి వ‌చ్చేందుకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. సాయంత్రం 4 గంట‌ల‌కు ఆయ‌న చేరుకోగా, విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర‌ప‌తి 5 గంట‌ల‌కు ఢిల్లీ చేరుకున్నారు. మ‌రో గంట వ్య‌వ‌ధిలోనే రాజీవ్ గాంధీ త‌న త‌ల్లి మ‌ర‌ణంతో ఖాళీ అయిన ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అధిష్టించారు. రాష్ట్ర‌ప‌తి ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఓ వైపు అధికారిక కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రిగిపోతుంటే... బ‌య‌ట కాంగ్రెస్ అనుకూల వ‌ర్గాల బీభ‌త్స కాండ మొద‌లైపోయింది. తొలుత ఢిల్లీలో ప్రారంభ‌మైన ఈ దాడులు... ఆ త‌ర్వాత మిగిలిన ప్రాంతాల‌కూ విస్త‌రించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే... ఇందిర మ‌ర‌ణం గురించి కాల్పులు జ‌రిగిన కాసేప‌టికే అంటే... 10 గంట‌ల స‌మయానికే స‌మాచారం అందుకున్న ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌త్వంత్ సింగ్... సిక్కుల ఊచ‌కోత‌ను నివారించేందుకు రంగంలోకి దిగారు. అయితే ఆయ‌న చేసిన య‌త్నాలేవీ ఫ‌లించ‌క‌పోగా, సిక్కుల ఆందోళ‌న‌ను అర్ధం చేసుకున్న వారు ఒక్క‌రు కూడా కేంద్ర స‌ర్కారులో లేర‌న్న అప‌వాదు కూడా ఉంది.

సైన్యాన్ని రంగంలోకి దించండి మ‌హాప్ర‌భో అని ప‌త్వంత్ సింగ్ నెత్తీ నోరు బాదుకున్నా... నాటి హోం మంత్రి హోదాలో ఉన్న పీవీ మాత్రం నాన్చుడు ధోర‌ణిని అవ‌లంబించార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. చాలా ఆల‌స్యంగా అంతా జరిగిపోయిన త‌ర్వాత న‌వంబ‌ర్ 1న సాయంత్రం ఆయ‌న సైన్యం రంగ ప్ర‌వేశానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అదీ కూడా అస్ప‌ష్ట‌త‌తో కూడిన పీవీ ఆదేశాల‌తో సైన్యం ఎంట్రీ మ‌రింత ఆల‌స్య‌మైంది. సాయంత్రం హోం మంత్రి నుంచి ఆదేశాలు విడుద‌లైతే... మ‌రునాడు ఉద‌యానికి గాని సైన్యం రంగంలోకి దిగ‌లేదు. అంత‌కుముందే సిక్కు ప్ర‌ముఖులు రాష్ట్ర‌ప‌తిని క‌లిస్తే... సైన్యాన్ని రంగంలోకి దించే హ‌క్కు త‌న‌కు లేద‌ని జ్ఞాని జైల్ సింగ్ త‌న అశ‌క్త‌త‌ను వారి ముఖం మీదే చెప్పేశార‌ట‌.

ఇక సిక్కుల ఊచ‌కోత‌ను నివారించేందుకు ప‌త్వంత్ సింగ్ మ‌రో న‌లుగులు సిక్కు ప్ర‌ముఖుల‌తో క‌లిసి రాజీవ్ గాంధీని క‌లిసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. నాటి కాంగ్రెస్ పార్టీ యువ‌నేత రాజేశ్ పైల‌ట్ ను వారు ఆశ్ర‌యించ‌గా, ఇందిర మ‌ర‌ణంపై సంతాపం తెలిపేందుకు మాత్ర‌మే అయితే రాజీవ్ అపాయింట్ మెంట్ ఇప్పిస్తాన‌ని తెగేసి చెప్పార‌ట‌. ఇందిర మ‌ర‌ణంపై సంతాపం తెలుపుతాం, సిక్కుల ఊచ‌కోత‌నూ ప్రస్తావిస్తామ‌న్న సిక్కు ప్ర‌ముఖుల‌కు పైల‌ట్ ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ఇప్పించ‌లేదు. దీంతో సిక్కు ప్ర‌ముఖులు నిరాశ‌గానే వెనుదిరిగారు. ఇదిలా ఉంటే... సిక్కుల ఊచ‌కోత‌పై ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టిన రెండు రోజుల‌కే రాజీవ్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ మ‌హావృక్షం కూలిపోయిన‌ప్పుడు ప్ర‌కంప‌న‌లు రావ‌డం చాలా స‌హ‌జం అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నాడు పెను క‌ల‌కల‌మే రేపాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/