Begin typing your search above and press return to search.

వూహాన్ నుంచి ఢిల్లీకి తెచ్చినోళ్లు ఇప్పుడేం చేస్తున్నారంటే?

By:  Tupaki Desk   |   3 Feb 2020 5:07 AM GMT
వూహాన్ నుంచి ఢిల్లీకి తెచ్చినోళ్లు ఇప్పుడేం చేస్తున్నారంటే?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించి వందలాది కథనాలు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. కరోనా వైరస్ కు పుట్టినిల్లు చైనాలోని వూహాన్ నగరం. ఇక్కడే మనోళ్లు వందలాదిగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వూహాన్ లో ఉండటం ఏ మాత్రం క్షేమకరం కాదు. అందుకే.. ప్రత్యేక దౌత్యంతో అక్కడున్న మనోళ్లను ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకొచ్చి.. హర్యానాలోని మానేసర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపుల్లో ఉంచటం తెలిసిందే.

ఇప్పటికి రెండు విమానాల్లో దాదాపు ఆరొందల మందిని తీసుకొచ్చి.. వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచారు. గురు గ్రామ్ కు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రత్యేక క్యాంపులో వూహాన్ నుంచి తీసుకొచ్చిన వారిని పద్నాలుగు రోజులు ఉంచనున్నారు. కరోనా వైరస్ ఏమైనా గుర్తిస్తే వారికి ప్రత్యేక వైద్యం అందిస్తారు. ఒకవేళ.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పరీక్షల్లో తేలితే వారిని వారి ఇళ్లకు పంపుతారు.

కరోనా వైరస్ లక్షణాలు పద్నాలుగు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంతోనే ప్రత్యేకమైన కేంద్రంలో ఉంచి పరీక్షలు జరుపుతున్నారు. మరి.. కరోనా వైరస్ భయం తో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడున్నోళ్లు ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నారు? రోజూ వారేం చేస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. ఆశ్చర్య పోవటం ఖాయం.

ఎందుకంటే.. కరోనా కేంద్రాల్లో ఉన్న యువకులు మహా ఉత్సాహంగా ఉండటమే కాదు.. పద్నాలుగు రోజుల క్యాంపును తమ ఆటపాటలతో సరదా సరదాగా మార్చేసుకున్నారు. ఉల్లాసంగా ఉండటమే కాదు.. రోజు మొత్తాన్ని ఆట పాటలతో అదరగొట్టేస్తున్నారట. వారిలో ఇప్పటివరకూ ఏ ఒక్కరికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించకపోవటంతో వారిపై ఎలాంటి ఒత్తిడి లేదంటున్నారు. ప్రస్తుతం ప్రత్యేకమైన క్యాంపుల్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ని అక్కడి ఆర్మీ వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వూహాన్ నుంచి వచ్చిన తమ వారు ఎలా ఉన్నారన్న విషయంపై ఆందోళన చెందుతున్న వారికి తాజా వార్త భారీ రిలీఫ్ ను ఇస్తాయని చెప్పక తప్పదు.