Begin typing your search above and press return to search.

33 శాతం ఎంపీ, ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు

By:  Tupaki Desk   |   15 July 2017 1:33 PM GMT
33 శాతం ఎంపీ, ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు
X
భార‌త‌దేశంలోని ప్ర‌జాప్ర‌తినిధుల విష‌యంలో మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విశ్లేష‌ణ తెర‌మీద‌కు వ‌చ్చింది. భారత రాష్ట్రపతి ఎన్నిక సంద‌ర్భంగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం రూపొందించిన నివేదిక అనేక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాల‌ను వెల్ల‌డించింది. ఇందులో కీల‌క‌మైన అంశంగా మ‌న ప్ర‌జాప్ర‌తినిధుల అవినీతి - మొత్తం ప్ర‌జాప్ర‌తినిధుల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం గురించి ఆశ్చ‌ర్య‌పోయే వివ‌రాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

కొత్త రాష్ట్రప‌తిని ఎన్నుకునేందుకు ఈనెల 17వ తేదీన ఎన్నిక నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని ఎంపీలు - ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ దేశ ప్ర‌థ‌మ పౌరుడి ఎన్నిక‌లో పాల్గొన‌నున్న నేప‌థ్యంలో ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం సార్వ‌త్రిక ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన అఫిడ‌విట్ల‌ను ప‌రిశీలించింది. మొత్తం 776 ఎంపీల‌లో 774 మంది ఎంపీలు అఫిడ‌విట్లు స‌మ‌ర్పించారు. 4,120 మంది ఎమ్మెల్యేలకు 4,078 మంది ఎమ్మెల్యేలు అఫిడ‌విట్లు అందించారు. ఈ మొత్తం మందిలో సుమారు 33 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని త‌మ ప‌రిశీల‌న‌లో తేలిన‌ట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపింది. మొత్తం ప్ర‌జాప్ర‌తినిధుల్లో 451 మంది మ‌హిళ‌లు మాత్ర‌మే ఉన్నారని త‌ద్వారా 9 శాతం మందికి మాత్ర‌మే భాగ‌స్వామ్యం ఉంద‌ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం విశ్లేషించింది.

మ‌రోవైపు ఎలక్టోరల్‌ కాలేజీలోని ఎంపీ - ఎమ్మెల్యేల్లో 71 శాతం కోటీశ్వరులున్నారని ఈ నివేదిక వెల్లడించింది. దేశ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేవ‌లం 9 శాతం మందికే ప్రాధాన్యం ఉండడం ఆశ్చర్యక‌ర‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో నేర చ‌రితులు సంఖ్య పెర‌గ‌డం కూడా గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.