Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 6న ఒకే ఓవర్లో 35 పరుగులు.. మే 6న 3 పరుగులే..

By:  Tupaki Desk   |   7 May 2022 1:30 PM GMT
ఏప్రిల్ 6న ఒకే ఓవర్లో 35 పరుగులు.. మే 6న 3 పరుగులే..
X
సరిగ్గా నెల కిందట.. అంటే ఏప్రిల్ 6న ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చాడు ఓ బౌలర్. ఇంకేముంది..? జట్టు ఓడిపోయింది.. విలన్ గా మారిపోయాడు. మళ్లీ నెల తిరిగే సరికి అదే బౌలర్.. చివరి ఓవర్.. అతడి చేతికే బంతి.. ఇంకేముంది? పైగా ఈసారి చేయాల్సింది 9 పరుగులే.. అంతా అయిపోయింది..? అనుకున్నారు. కానీ, ఆ బౌలర్ అద్భుతం చేశాడు. కేవలం మూడు పరుగులే ఇచ్చి జట్టును గెలిపించాడు. చిత్రమేమంటే.. నాటి మ్యాచ్ లో ఈ బౌలర్ వేసింది 3 ఓవర్లే. నిన్నటి మ్యాచ్ లో వేసిందీ 3 ఓవర్లే. కానీ, ఫలితమే తేడా..

శుక్రవారం ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ లో జరిగిందీ ఘటన.ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై 5 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' టిమ్‌ డేవిడ్‌ (44 నాటౌట్‌; 21 బంతుల్లో 2×4, 4×6), ఇషాన్‌ కిషన్‌ (45; 29 బంతుల్లో 5×4, 1×6), రోహిత్‌ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో ముంబయి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (2/24) రాణించాడు. అనంతరం ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ గుజరాత్‌ విజయానికి బాటలు పరిచినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులే చేసింది. జోరుమీదున్న గుజరాత్‌ ఓపెనర్లను ఒకే ఓవర్లో ఔట్‌ చేసి మురుగన్‌ అశ్విన్‌ (2/29) మలుపు తిప్పగా.. చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన సామ్స్‌ (3-0-18-0) ముంబయిని గెలిపించాడు.

బుమ్రాను బాదేసినా..గుజరాత్‌ ఓపెనర్లు సాహా, గిల్ క్రీజులో ఉన్నంతసేపు ముంబయి విజయం గురించి చర్చే లేదసలు. ముంబయి బౌలర్లను ఆటాడుకోవడంలో వీరు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఆరంభంలో సాహా చెలరేగితే.. ఆ తర్వాత అతడికి కాస్త విశ్రాంతినిచ్చి గిల్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్‌ప్లేలో 54/0తో నిలిచిన ఆ జట్టు.. 11 ఓవర్లకే 100 మార్కును అందుకుంది. వికెట్‌ కోసం ముంబయి బౌలర్లందరూ ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రధాన పేసర్‌ బుమ్రా (4-0-48-0)ను గుజరాత్‌ ఓపెనర్లు లెక్కే చేయలేదు. మ్యాచ్‌ పోవడం ఖాయం, కనీసం ముంబయి ఒకటో రెండో వికెట్లయినా పడగొడుతుందా అని చూస్తున్న వేళ.. మురుగన్‌ అశ్విన్‌ 12వ ఓవర్లో తొలి, ఆఖరి బంతులకు గిల్‌, సాహాలను ఔట్‌ చేశాడు. అయినా గుజరాత్‌కు ఛేదన కష్టం కాదనే అనుకున్నారంతా.

అందుకు తగ్గట్లే హార్దిక్‌ పాండ్య (24), సాయిసుదర్శన్‌ (14) కాసేపు నిలకడగా ఆడారు. అయితే వీళ్లిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వెనుదిరిగారు. సుదర్శన్‌ హిట్‌వికెట్‌ అయితే.. పాండ్య రనౌటయ్యాడు. ఈ స్థితిలో గుజరాత్‌ తమ ఫినిషర్లు మిల్లర్‌ (19 నాటౌట్‌; 14 బంతుల్లో 1×4, 1×6), తెవాతియా (3)ల మీదే ఆశలు పెట్టుకుంది. మిల్లర్‌ నమ్మకాన్ని నిలబెడుతూ ధాటిగా ఆడటంతో చివరి ఓవర్లో 9 పరుగులే చేయాల్సి వచ్చింది. కానీ సామ్స్‌ షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు. తొలి రెండు బంతుల్లో అతను ఒక్క పరుగే ఇచ్చాడు. మూడో బంతికి రెండో పరుగు తీయబోతూ తెవాతియా రనౌటయ్యాడు. నాలుగో బంతికి సింగిల్‌ వచ్చింది. 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. మిల్లర్‌ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. కానీ అతను షాట్‌ ఆడలేని విధంగా 2 బంతులను సంధించి సామ్స్‌ గుజరాత్‌కు షాకిచ్చాడు.

ఇదే సామ్స్ ఏప్రిల్ 6న ఏం చేశాడంటే..గత నెల 6న కోలకతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ తలపడింది. మొదట ముంబై 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. చేజింగ్ లో కోల్ కతా 13.1 ఓవర్లకు 101 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది. 47 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈ సమయంలో నైట్ రైడర్స్ విజయంపై ఎవరికీ నమ్మకాలు లేవు. కానీ, ఆసీస్ పేసర్, టెస్టు కెప్టెన్ కమ్మిన్స్ అనూహ్యంగా చెలరేగాడు. బుమ్రా, టైమల్ మిల్స్ వేసిన ఓవర్లలో రెండేసి సిక్స్ లు, రెండేసి ఫోర్లు కొట్టిన అతడు డేనియల్ సామ్స్ వేసిన 16వ ఓవర్లో విరుచుకుపడ్డాడు. 6,4,6,6,3 (నోబాల్), 4, 6 తో మ్యాచ్ ను ముగించేశాడు. దీంతో సామ్స్ మొఖం వెలవెలబోయింది.

నాడు 3 ఓవర్లలో 50..నేడు 3 ఓవర్లలో 18 గత నెల 6న నాటి మ్యాచ్ లో సామ్స్ 3 ఓవర్లలోనే 50 పరుగులిచ్చాడు. కానీ, ముంబైతో శుక్రవారం మ్యాచ్ లో అదే మూడు ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చాడు. నాడు ఒక వికెట్ పడగొట్టాడు. శుక్రవారం వికెట్ తీయకున్నా మ్యాచ్ ను గెలిపించాడు. ఇంతకూ ఆ సామ్స్ ఎవరంటే ఆస్ట్రేలియాకు చెందిన ఎడమ చేతివాటం పేస్ ఆల్ రౌండర్. 29 ఏళ్ల సామ్స్ 2020 చివర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఏడు టి20లు ఆడాడు.