Begin typing your search above and press return to search.

తెలుగుదేశం పార్టీకి భూసంత‌ర్ప‌ణ‌

By:  Tupaki Desk   |   10 Jun 2017 10:44 AM GMT
తెలుగుదేశం పార్టీకి భూసంత‌ర్ప‌ణ‌
X
చంద్ర‌బాబు మూడేళ్ల పాల‌న‌లో నిరుపేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించి ఇవ్వ‌క‌పోయినా తాను మాత్రం హైద‌రాబాద్‌ - విజ‌య‌వాడ‌ల్లో అన్ని హంగుల‌తో ఇళ్లు స‌మ‌కూర్చుకున్నారు. తానొక్క‌డికే కాకుండా ఇప్పుడు పార్టీకి కూడా కారుచౌక‌గా భ‌వ‌నాలు నిర్మించ‌డానికి చంద్ర‌బాబు రెడీ అవుతున్నారు. తాజాగా మంత్రివ‌ర్గ స‌మావేశంలో తీసుకున్న ఓ నిర్ణ‌యాన్ని విప‌క్షాలు త‌ప్పుప‌డుతున్నాయి. పేద‌ల విష‌యం ప‌ట్టించుకోకుండా పార్టీ కోసం ఎక‌రాల‌కు ఎక‌రాలు కేటాయించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నాయి.

ఇళ్ల స్థలాల కోసం రాష్ర్టంలోని ల‌క్ష‌లాది మంది జన్మభూమి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడంపై శ్రద్ధ చూపని తెలుగుదేశం సర్కారు తెలుగుదేశం పార్టీకి ప్రతి జిల్లాలో, రాష్ట్రస్థాయిలో వీలైనంత మేర కారుచౌకగా ఆస్తులను సమకూర్చిపెట్టేందుకు మాత్రం స్పీడు చూపిస్తోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు ప్రభుత్వం గతేడాది ప్రత్యేకంగా జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దాని ప్ర‌కారం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి గుంటూరు జిల్లా మంగళగరి మండలం ఆత్మకూరులో 3.65 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గతనెల 31వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి పేరుమీద పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈ భూమిని కేటాయించారు.

మొద‌ట 33 ఏళ్లపాటు లీజుకు కేటాయిస్తూ, ఆ తరువాత లీజును 99 ఏళ్ల వరకు పొడిగించేలా నిర్ణయం తీసుకున్నారు. లీజును ఎకరానికి ఏడాదికి రూ.1,000గా నిర్ణ‌యించారు. ఆ భూమి విలువ సుమారు 8 కోట్లు చేస్తుంద‌ని విప‌క్ష నేత‌లు అంటున్నారు. అంత విలువైన భూమిని అతి త‌క్కువ లీజుకు కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/