Begin typing your search above and press return to search.

పాడు ఎండ‌లు 37 ప్రాణాలు తీశాయ్ చంద్రుళ్లు!

By:  Tupaki Desk   |   20 April 2017 4:36 AM GMT
పాడు ఎండ‌లు 37 ప్రాణాలు తీశాయ్ చంద్రుళ్లు!
X
నిత్యం నీతులు చెప్పే ఇద్ద‌రు చంద్రుళ్లు ముఖ్య‌మంత్రుల రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఎవ‌రికి వారే త‌మ‌కు మించిన తోపులు లేర‌న్న మాట‌ను త‌మ మాట‌ల్లో త‌ర‌చూ చెబుతుంటారు. నిజ‌మే.. వారంత తోపులు లేరుకాబ‌ట్టే.. వారు మాత్ర‌మే రాష్ట్రాల‌కు ముఖ్య‌మంత్రులు అయ్యార‌ని అనుకుందాం. కానీ.. తోపులుగా ఉన్నోళ్లు సీఎంగా ఉన్నప్పుడు.. జ‌నాల ప్రాణాలు చిన్న చిన్న విష‌యాల‌కే పోకూడ‌దు క‌దా? అన్న చిన్న ప్ర‌శ్న వేసుకుంటే స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి.

ఎండాకాలం వ‌స్తుందంటే చాలు.. భ‌గ‌భ‌గ మండే మంట‌ల నిప్పుల కొలిమి గ‌డిచిన కొన్నేళ్లుగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితంగా మారింది. మండే ఎండ‌ల్ని లైట్ తీసుకున్న పాపానికి ప్రాణాలు పెద్ద ఎత్తున పోగొట్టుకోవ‌టం రోటీన్ గా మారింది. పెద్ద ఎత్తున ప్రాణాలు పోయిన త‌ర్వాత‌.. క‌ళ్లు తెరిచే సీఎంల పుణ్య‌మా అని.. ఏడాదికేడాది ఎండ‌ల ఊసురు త‌గిలే వారి సంఖ్యే ఎక్కువ అవుతున్న ప‌రిస్థితి.

గ‌త ఏడాది రెండుతెలుగురాష్ట్రాల్లో వంద‌లాది ప్రాణాలు ఎండ‌ల‌కుపోయిన త‌ర్వాత తీరుబ‌డిగా స్పందించిన‌చంద్రుళ్లు.. ఈసారీ అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్పక త‌ప్ప‌దు. పాడు ఎండ‌ల పుణ్య‌మా అని బుధ‌వారం నాటికిరెండు తెలుగు రాష్ట్రాల్లో 37 మంది ప్రాణాలు పోయిన విష‌యాన్ని అధికారులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రు చంద్రుళ్లు స్పందించింది అంతంత మాత్ర‌మే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధార‌ణం కంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న వేళ‌.. తీసుకోవాల్సిన చ‌ర్య‌లేమీ తీసుకోక‌పోవ‌టం అస‌లైన విషాదంగా చెప్పాలి. తాజాగా రెండు రాష్ట్రాల్లోనూ కాస్త అటూఇటూగా 45 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదువుతున్న ప‌రిస్థితి.

ఎండ తీవ్ర‌త మీద అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు అందిస్తున్నా.. వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా రాష్ట్ర స‌ర్కార్లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లేమీ తీసుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు ఇద్ద‌రు చంద్రుళ్ల మీదా వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ‌లో.. ప్ర‌భుత్వం మీద ఆధార‌ప‌డ‌టం మానేసి.. ఎవ‌రికి వారు సొంతంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం మంచిద‌న్న విష‌యాన్ని గుర్తించాలి. ముఖ్యంగా ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండే స‌మ‌యం (ఉద‌యం 11 గంట‌ల త‌ర్వాత నుంచి మ‌ధ్య‌హ్నాం నాలుగు గంట‌ల వ‌ర‌కూ) లో వీలైనంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఒక‌వేళ బ‌య‌ట‌కు వ‌చ్చినా.. త‌గిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలే త‌ప్పించి.. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ప్రాణాల మీద‌కు తెచ్చుకోకూడ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఒక‌వేళ‌.. మండేఎండ‌ల్ని లైట్ గా తీసుకునే వారు క‌నిపిస్తే.. వారికి విష‌యంచెప్పి జాగ్ర‌త్త‌ల గురించి హెచ్చ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. పాల‌కులు పాల‌న‌ను మ‌ర్చిపోయిన‌ప్పుడు ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు మ‌రింత అలెర్ట్ గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/