Begin typing your search above and press return to search.

38 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం షాక్‌!

By:  Tupaki Desk   |   11 Nov 2022 7:39 AM GMT
38 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం షాక్‌!
X
వచ్చే నెల డిసెంబర్‌లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ మొదటి వారంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కాగా 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో గత 23 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉండటం గమనార్హం.

గుజరాత్‌ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ మరోమారు గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. అందులోనూ 2024 ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయంలోపే ఉంది. ఒకవేళ గుజరాత్‌లో బీజేపీ ఓడిపోతే ఈ ప్రభావం పార్లమెంటు ఎన్నికలపైనా పడుతోంది.

ఈ ప్రమాదాన్ని గుర్తెరిగిన బీజేపీ గుజరాత్‌లో విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీలు గట్టి పోటీ ఇస్తుండటంతో బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 160 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న 38 మందికి షాక్‌ ఇచ్చింది. వారికి తిరిగి సీట్లు కట్టబెట్టలేదు. సీట్లు దక్కని 38 మందిలో ఐదుగురు మంత్రులు కూడా ఉండటం గమనార్హం.

కాగా ఇటీవల వేలాడే తీగల వంతెన దుర్ఘటన జరిగి 135 మృత్యువాత పడ్డ మోర్బీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేశ్‌ మెర్జాకు సైతం టికెట్‌ నిరాకరించారు. బ్రిజేష్‌ మెర్జా కాకుండా మరో నలుగురు మంత్రులు.. రాజేంద్ర త్రివేది, ప్రదీప్‌ పర్మార్, అరవింద్‌ రైయానీ, ఆర్‌.సి.మక్వానాకు కూడా సీట్లు దక్కలేదు. చివరికి శాసనసభ స్పీకర్‌ నీమాబెన్‌ ఆచార్యకు కూడా టికెట్‌ ఇవ్వలేదు.

సీట్లు దక్కించుకున్న 160 మందిలో ఓబీసీలు 49 మంది, పటేళ్లు 40 మంది, క్షత్రియులు 19, బ్రాహ్మణులు 13 మంది ఉన్నారు. అదేవిధంగా జైనులు ఇద్దరు సీట్లు దక్కించుకున్నారు.

సీట్లు పొందిన 160 మందిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 69 మంది ఉన్నారు. వీరిలో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారు.

కాగా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తన సొంత నియోజకవర్గం ఘాట్లోడియా నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారు. పాటిదార్‌ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన హార్దిక్‌ పటేల్, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్నారు.

గుజరాత్‌లోని విరామ్‌గామ్‌ స్థానం నుంచి పాటిదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్, జామ్‌నగర్‌ నార్త్‌ స్థానం నుంచి రివాబా జడేజా బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తారు.

మరోవైపు 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడాన్ని బీజేపీ అధిష్టానం సమర్థించుకుంది. వారి అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌తోపాటు మరికొందరు సీనియర్‌ నాయకులు ఈ ఎన్నికల్లో పోటీపడొద్దని నిర్ణయించుకున్నారని భూపేంద్ర యాదవ్‌ వెల్లడించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.