Begin typing your search above and press return to search.

ఆ దేశంలో ఇక నాలుగున్నర రోజులే పని

By:  Tupaki Desk   |   8 Dec 2021 4:34 AM GMT
ఆ దేశంలో ఇక నాలుగున్నర రోజులే పని
X
ఒకప్పుడు అమెరికాలో 18 గంటల పనివిధానానికి వ్యతిరేకంగా కార్మికులు రోడ్డెక్కడం.. కాల్పులు జరగడం.. అదో పెద్ద కమ్యూనిస్టు ఉద్యమంగా మారి ఇప్పుడు మనకు 8 గంటల పని విధానం వచ్చేసింది. అది చాలా దేశాల్లో కొనసాగుతోంది.

అయితే కాలం మారడంతో సాఫ్ట్ వేర్ కొలువులు రావడంతో వీకెండ్ కు సెలవులు ఇచ్చేశారు. ప్రతి శని, ఆదివారాలు ఉద్యోగులు ఎంజాయ్ చేసి సేదతీరేలా వెసులుబాటును కల్పించారు.

అయితే ప్రపంచమంతా శని, ఆదివారాలు సెలవు తీసుకుంటే ముస్లిం దేశాలైన గల్ఫ్ కంట్రీల్లో ప్రతి శుక్రవారం సెలవు ఉంటుంది. అయితే దాని వల్ల వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఆదివారం సెలవు ఉండడం..గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీల్లో ఆదివారం పనిచేస్తూ శుక్రవారాలు సెలవు తీసుకోవడంతో ఆ రెండు రోజులు వృథాగా మారుతోంది.

ఇప్పుడు దాన్ని మార్చడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా అరబ్ దేశాల్లో ఉన్న వీకెండ్ సిస్టమ్ ను సమూలంగా మార్చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

ఇన్నాళ్లు శుక్ర, శనివారాలు వీకెండ్ గా యూఏఈలో ఉంటే ఇప్పుడు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకూ అంటే రెండున్నర రోజులు వీకెండ్ గా డిసైడ్ చేసింది. అంటే కేవలం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు. దీంతో ఆ దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాలన్నీ ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ప్రపంచంలో నాలుగున్నర రోజుల పనివిధానాన్ని పాటిస్తున్న తొలి దేశం యూఏఈ కావడం విశేషం. మిగతా దేశాల్లో ఆదివారం సెలవు ఉండడం.. అదే సమయంలో అన్ని వ్యాపార కార్యాలయ వ్యవహారాలకు శుక్రవారం యూఏఈలో సెలవు కావడంతో ఇబ్బందిగా మారింది. అందుకే ఇలాంటి నిర్ణయాన్ని అరబ్ దేశం తీసుకున్నట్టు తెలుస్తోంది.