Begin typing your search above and press return to search.

ప్రముఖ నిర్మాత అకౌంట్ నుంచి 4 లక్షలు చోరీ..!

By:  Tupaki Desk   |   28 May 2022 1:30 PM GMT
ప్రముఖ నిర్మాత అకౌంట్ నుంచి 4 లక్షలు చోరీ..!
X
టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాలు ఎక్కువైపోయారు. సామాన్యుల నుంచీ, సెలబ్రిటీల వరకూ అందరూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటున్నా.. సైబర్ వలలో చిక్కుకునేలా చేస్తున్నారు. తెలియకుండానే బ్యాంక్ ఖాతాలలో నుంచి డబ్బులను మాయం చేస్తున్నారు.

తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నుంచి డబ్బు దోచుకున్నారు. బోనీ క్రెడిట్ కార్డు ద్వారా లక్షల రూపాయలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. ఈ విషయంపై బోనీ కపూర్ బుధవారం (మే 25) ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వివరాలు మరియు పాస్ వర్డ్ తదితర డేటాను సైబర్ నేరగాళ్లు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. వీటి సహాయంతో నిందితులు ఫిబ్రవరి 9న ఐదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపారు. ఈ క్రమంలో త‌న అకౌంట్ నుంచి దాదాపు 4 ల‌క్ష‌లు ట్రాన్స్‌ ఫ‌ర్ అయిన‌ట్లు బోనీక‌పూర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీకి విషయం తెలియదని.. తర్వాత ట్రాన్సాక్షన్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. త‌న‌ను ఎవ‌రూ క్రెడిట్ కార్డు వివ‌రాలు అడ‌గ‌లేద‌ని.. క‌నీసం ఫోన్ కాల్ - మెసేజ్ కూడా రాలేద‌ని బోనికపూర్ తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు వాడుతున్న స‌మ‌యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు డేటాను చోరీ చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అలాగే చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌ లోని ఓ కంపెనీ అకౌంట్‌ లోకి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీసులు తెలిపారు.

కాగా, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటుగా సౌత్ లోనూ వరుస సినిమాలని నిర్మిస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. ఇక బోనీ ఇద్దరు కూతుర్లు కూడా తెరంగ్రేటం చేశారు. జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే.. ఖుషీ కపూర్ నెట్ ఫిక్స్ కోసం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ రూపొందించే 'ది అర్చీస్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.