Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలు మిస్సింగ్...అధికార పార్టీలో టెన్షన్

By:  Tupaki Desk   |   31 Dec 2018 9:59 AM GMT
ఎమ్మెల్యేలు మిస్సింగ్...అధికార పార్టీలో టెన్షన్
X
కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవులు ఆశించిన ఆ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అధికార పార్టీలో వణుకు పుట్టిస్తోంది.

ఇటీవల ప్రతిపక్ష పార్టీ బీజేపీ సైతం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే పరిస్థితి ఏమిటన్న భయంతో కుమార స్వామిల ఆందోళనకు గురవుతున్నారు. బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర -హోసపెటి ఎమ్మెల్యే ఆనందసింగ్ - కంప్లి ఎమ్మెల్యే గణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జార్కహోలే మంత్రి వర్గం విస్తరణ జరిగిన మరుసటి రోజు నుంచి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తోంది.

బీజేపీ రాజకీయ వ్యూహంలో జేడీఎస్ తో జత కట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కర్ణాటక సీఎం కుమార స్వామి కలవర పడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేల అజ్ఞాతవాసం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో సంచలనం రేపింది.

బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్ కు నలుగురు ఎమ్మెల్యేలు ఆకర్షితులయ్యారా? అన్న సందేహం నెలకొంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ అధికారం కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ఎంపీ స్థానాలను గెలవాలంటే అధికారంలో ఉంటే మంచిదన్న లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎమ్మెల్యేలు కనిపించకపోవడం అధికార జేడీఎస్-కాంగ్రెస్ లకు ముచ్చెమటలు పోయిస్తోంది.