Begin typing your search above and press return to search.

బర్డ్ ఫ్లూ కాదు ... ఆ వ్యాధితోనే 4 వేల కోళ్లు మృతి !

By:  Tupaki Desk   |   3 March 2021 6:30 AM GMT
బర్డ్ ఫ్లూ కాదు ...  ఆ వ్యాధితోనే 4 వేల కోళ్లు మృతి !
X
పెద్దపల్లి జిల్లాలో మరోసారి కోళ్లు పెద్ద సంఖ్యలో మరణించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అకస్మాత్తుగా వేల సంఖ్యలో కోళ్లు మరణించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం వింత రోగంతో నాలుగు వేల నాటు కోళ్లు మృతి చెందాయి. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన స్వామి అనే రైతు నాలుగు వేల కోళ్లను పెంచుతున్నాడు. మంగళవారం ఉదయం కోళ్లకు దాణా వేసిన తర్వాత వాటిని ఫామ్ లో వదిలిపెట్టాడు. రెండు గంటల తరువాత ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి.దీంతో తనకు 20 లక్షల నష్టం వాటిల్లినట్లు స్వామి తెలిపారు.

ఉన్నట్టుండి కోళ్లు చనిపోవడానికి బర్డ్ ఫ్లూ సోకిందా అనే అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఎండలు బాగా ముదరడంతో వేడికి తట్టుకోలేకపోయి మరణించి ఉంటాయి అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అకారణంగా మరణించిన 4 వేల కోళ్లు రాణికెట్ అనే వ్యాధి తో మరణించాయి అని తేల్చేశారు. మొదట్లో బర్డ్ ఫ్లూ సోకిందా అనే అనుమానం వ్యక్తం చేసినా , ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. రాణికెట్ వ్యాధి వచ్చిన కోళ్ల రెక్కలు నేల వాలుతాయి. కాళ్లు , మెడ చచ్చుబడి పోయి దాదాపుగా పక్షవాతం వచ్చిన విధంగా కోళ్లు అన్ని పడిపోయి , ఆ తర్వాత చనిపోతాయి. ఈ రాణికెట్ అనే వ్యాధి ఓ కోడికి వచ్చినా , దాని చుట్టూ ఉన్న ఇతర అన్ని కోళ్లకి వ్యాపిస్తుంది. అయితే ఈ రాణికెట్ వ్యాధి తో మనుషులకి ఎటువంటి ప్రమాదం ఉండదట.