Begin typing your search above and press return to search.

40 కోట్లతో ఐపీ పెట్టి మరీ ఉడాయించిన చిట్టీల వ్యాపారి

By:  Tupaki Desk   |   2 May 2022 11:31 AM GMT
40 కోట్లతో ఐపీ పెట్టి మరీ ఉడాయించిన చిట్టీల వ్యాపారి
X
బ్యాంకులు ఏమో రుణాలు ఇవ్వవు.. ఓ లక్ష రూపాయల అప్పు కావాలంటే బయట భారీగా వడ్డీలున్నాయి. లక్ష కు రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇంత భారీగా వడ్డీకి తీసుకుంటే అప్పుల పాలు కావాల్సిందే. ఇక అప్పు చేయకుండా.. బ్యాంకు రుణం తీసుకోకుండా మరో మార్గం ఏదైనా ఉందంటే అది ‘చిట్టీలే’. ప్రభుత్వ గుర్తింపు లేకుండా.. బడా బాబులు చాలా మంది తెలిసిన వారందరినీ జట్టు కట్టి చిట్టీల పేరుతో దందా నిర్వహిస్తుంటారు. గ్రామాలు, నగరాల్లో ఇలాంటి వారు ఎందరో ఉంటారు. తాజాగా వరంగల్ లో ఇలానే చిట్టీల పేరుతో ఓ వ్యాపారి ఘరానా మోసం చేశాడు. కోట్లు కొల్లగొట్టి ఉడాయించాడు. దీంతో చిట్టీలు వేసిన వారంతా లబోదిబోమంటున్నారు.

వరంగల్ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ ఫైనాన్స్ వ్యాపారి పారిపోయాడు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 900 మంది వద్ద రూ.40 కోట్ల వరకూ వసూలు చేసి ఐపీ పెట్టి మరీ పారిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ అవసరాలకు ఉపయోగపడుతాయని కష్టపడిన సొమ్మును పొదుపు చేస్తే నమ్మించి వ్యాపారి మోసం చేశాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వరంగల్ లో చిట్టీల పేరుతో కంపెనీల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కష్టమర్ల నుంచి ప్రతి నెల చిట్టీ డబ్బులు వసూలు చేసి గడువు ముగిశాక చేతులు ఎత్తేయడం లేదా తప్పించుకొని పారిపోవడం సాధారణమైపోయింది.

తాజాగా వరంగల్ లేబర్ కాలనీలో కల్పవల్లి చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. చిట్ ఫండ్ సంస్థ నిర్వాహకులు మూడెడ్ల వెంకటేశ్వర్లు, ఆయన భార్య రేవతి చిట్టీల పేరుతో రూ.40 కోట్ల రూపాయల వరకూ వసూలు చేశారు. ఎవరికీ తెలియకుండా ఇంటికి తాళం వేసి ఐపీ పెట్టి పారిపోయారు. నోటీసు అందుకున్న బాధితులు లబోదిబోమంటూ వెంకటేశ్వర్లు ఇంటికి చేరి ఆందోళనకు దిగారు. సుమారు 900 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం.. చదువుల కోసం ఉపయోగపడుతాయని పైసా పైసా కూడబెట్టి ఉపవాసం ఉండి మరీ చిట్టీలు వేస్తే ఇలా నమ్మించి నట్టేట ముంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్పవల్లి ఫైనాన్స్ లో చిట్టీలు వేసిన వారిలో ఇప్పటికే కొందరికీ ఐపీ నోటీసులు అందాయి. దీంతో బాధితులు వెంకటేశ్వర్లు ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పారిపోయిన వెంకటేశ్వర్ దంపతుల గురించి ఆరాతీస్తున్నారు.