Begin typing your search above and press return to search.

కేసీఆర్ గారూ!... అప్పుడే 40 రోజులైందండీ!

By:  Tupaki Desk   |   21 Jan 2019 11:19 AM GMT
కేసీఆర్ గారూ!... అప్పుడే 40 రోజులైందండీ!
X
కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో అప్పుడే రెండు సార్లు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిపోయాయి. తొలి ఎన్నిక‌ల్లో తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించిన ఉద్య‌మ‌కారుడిగా ప్ర‌జ‌లంతా కేసీఆర్‌కు ప‌ట్టం క‌డితే... రెండో ద‌పా త‌న‌దైన సంక్షేమ పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టిన గులాబీ ద‌ళ‌ప‌తికే ప్ర‌జ‌లు నీరాజ‌నం ప‌లికారు. వెర‌సి రాష్ట్రానికి తొలి, మ‌లి సీఎంగా కూడా కేసీఆరే రికార్డుల‌కెక్కారు. ఇదంతా బాగానే ఉన్నా... తొలి ఎన్నిక‌ల త‌ర్వాత పాల‌న‌ను త‌న‌దైన శైలిలో ప‌రుగులు పెట్టించిన కేసీఆర్‌... ఈ ద‌ఫా మాత్రం పాల‌న‌పై అంత‌గా దృష్టి సారించ‌ని వైనం ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. రాష్ట్రంలో ఏ ప‌నులు కూడా న‌త్త‌న‌డ‌క‌న సాగేందుకు వీలు లేద‌న్న‌ట్లుగా తొలి సారి సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన కేసీఆర్‌... త‌న మ‌దిలోని ప్రాజెక్టుల‌న్నింటినీ ఒక్క‌టొక్క‌టిగానే అయినా... దాదాపుగా అన్ని ప‌థ‌కాల‌ను అమ‌ల్లోకి తెచ్చేయ‌డంతో పాటు వాటి అమ‌లును కూడా ప‌రుగులు పెట్టించారు. సాగునీటి ప్రాజెక్టుల‌తో పాటు సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా కేసీఆర్ త‌న‌దైన శైలిలో అమ‌లు చేశారు. ఈ కార‌ణంగానే రెండో ద‌ఫా కూడా కేసీఆరే సీఎంగా ఉంటే త‌మ భ‌విత‌కు భ‌రోసాగా ఉంటుంద‌ని ప్ర‌జ‌లంతా భావించారు. టీఆర్ఎస్‌కు బంప‌ర్ మెజారిటీ ఇచ్చారు. రెండో ద‌ఫా విజ‌యం సాధించిన త‌ర్వాత తాను సీఎంగా ప్ర‌మాణం చేయ‌డంతో పాటు, త‌న తొలి కేబినెట్ డిప్యూటీ సీఎంగా ఉన్న మ‌హ‌మూద్ అలీని హోం మినిస్ట‌ర్‌గా చేసుకున్నారు. అంత‌కుమించి మిగిలిన కేబినెట్ మినిస్ట‌ర్ల‌ను ఆయ‌న ఇప్ప‌టిదాకా ప్ర‌క‌టించ‌లేదు. ఫ‌లితంగా ఇప్పుడు 40 రోజులుగా తెలంగాణ‌లో కేబినెట్ అన్న‌దే లేకుండా పోయింది.

అయితే రెండో ద‌ఫా ప‌గ్గాలు చేప‌ట్టిన ద‌రిమిలా... మ‌రింత మెరుగైన కేబినెట్ ను ఏర్పాటు చేసుకుందామని భావించిన కేసీఆర్‌... అందు కోసం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా మొన్న‌టిదాకా వార్త‌లు వినిపించాయి. అయితే క‌స‌ర‌త్తులు ఎన్ని రోజులు జ‌రుగుతాయి? కేబినెట్ లేకుండా పాల‌న సాగేదెలా? అస‌లు కేసీఆర్ కేబినెట్ ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? మంత్రులు లేకుండానే కేసీఆర్ పాల‌న సాగిస్తారా? అన్న ప్ర‌శ్న‌లు ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ప్ర‌శ్న‌లు వెల్లువెత్తినా... వాటి వైపు క‌న్నెత్తి కూడా చూసేందుకు సిద్ధంగా లేని కేసీఆర్‌... త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్న కేసీఆర్‌... నేడు ఏకంగా చండీయాగానికి శ్రీ‌కారం చుట్టారు. సో... మ‌రో వారం పాటు కేబినెట్ కూర్పు, ప్ర‌క‌ట‌న అనే ప్ర‌సక్తే లేదు. అంటే ఇప్ప‌టికే కేసీఆర్ సీఎంగా ప్ర‌మాణం చేసి 40 రోజులు అయినా... కేబినెట్ లేకుండానే తెలంగాణ పాల‌న సాగిపోయింద‌న్న మాట‌.

అయినా కేసీఆర్ మ‌దిలో ఏముంద‌న్న కోణంలో ర‌క‌ర‌కాల‌ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అన్న మాటే వినిపించ‌కుండా చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్‌... ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకే కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌లేద‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. విప‌క్షం లేకుండా సాగే పాల‌న‌ను నియంత పాల‌న‌గా పిలుస్తార‌న్న విశ్లేష‌కులు... అస‌లు కేసీఆర్ ఆ దిశ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు కేబినెట్ జాప్యంపై త‌న సొంత అల్లుడు త‌న్నీరు హ‌రీశ్ రావే తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలో ఏమాత్రం బ‌య‌ట‌ప‌డ‌కుండానే హ‌రీశ్ నెట్టుకువ‌స్తున్నా... ఆయ‌న అనుచ‌ర‌గ‌ణంతో పాటు పార్టీకి చెందిన ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు, మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారు మాత్రం కేసీఆర్ వైఖ‌రి ఏమిటో అర్థం కాక కుత‌కుత‌లాడిపోతున్నారు. మ‌రి వీటిన్నింటికీ ఒక్క దెబ్బ‌కు ప‌రిష్కారం ఇచ్చేలా కేసీఆర్ కేబినెట్ దిశ‌గా ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.