Begin typing your search above and press return to search.

ఏపీలో వలసలకు ఇచ్చిన వరం.. మన దగ్గర లేదా కేసీఆర్?

By:  Tupaki Desk   |   7 May 2020 8:30 AM GMT
ఏపీలో వలసలకు ఇచ్చిన వరం.. మన దగ్గర లేదా కేసీఆర్?
X
విషయం ఏదైనా కానీ..ఎక్కడా తగ్గకూడదన్నట్లుగా వ్యవహరించే తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. చేస్తామా? చేయమా? అన్నది పక్కన పెడితే.. మాటల్లో మాత్రం గొప్పలు అదే పనిగా చెబుతుంటారు సారు. వలస కూలీల్ని వారి సొంత రాష్ట్రాలకు పంపే విషయంలో తాము చేస్తున్న దాని గురించి గొప్పలు చెబుతూనే.. కేంద్రం తీరును తిట్టిపోశారు కేసీఆర్. వలసకూలీల్ని వారి సొంతూళ్లకు పంపే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు.. చెబుతున్న మాటలు.. తీసుకుంటున్న నిర్ణయాలు పెద్ద ఎత్తున విమర్శలకు గురి అవుతున్నాయి.

కరోనా లాంటి కష్టకాలంలో.. ఖాళీగా ఉన్న రైలు బండ్లను పట్టాలెక్కించటమే గొప్పగా.. వలసల తరలింపునకు కేటాయించిన రైళ్లలో టికెట్ ధరల్ని వసూలు చేస్తున్న వైనానికి ఒళ్లు మండక మానదు. ఇది సరిపోదన్నట్లుగా అదనపు చార్జీల్ని వసూలుచేసే ధోరణి చూస్తే.. వడ్డీ వ్యాపారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మోడీ సర్కారు తీరు కనిపిస్తుంది.

తమ రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపే విషయంలో కేసీఆర్ సర్కారు ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసింది. రోజుకు 40 శ్రామిక్ రైళ్లను నడుపుతామని ప్రకటించినా.. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో పన్నెండుకు తగ్గించారు. ప్రస్తుతం పది నుంచి పన్నెండు రైళ్లను నడుపుతున్నారు. ఉచిత టికెట్ తో పాటు.. భోజనం.. మంచినీళ్ల బాటిల్ ను వారికి ఇస్తున్నారు.తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీ సర్కారు వలసల తరలింపులో మరో అడుగు ముందులో ఉంది.

తమ రాష్ట్రంలో ఉన్న వలసల కూలీలు.. కార్మికుల్ని వారి వారి రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేయటమే కాదు.. వారి చేతికి రూ.500 నగదును ఇచ్చి పంపాలని జగన్ సర్కారు నిర్ణయించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల వద్ద చిల్లిగవ్వ లేకుండా పోవటంతో.. వారి చేతుల్లో రూ.500 పెట్టి మరీ ఇంటికి పంపుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఏపీనే వలసల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. సంపన్న తెలంగాణ మాటేమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.