Begin typing your search above and press return to search.

ఫార్టీ ఇయర్స్ టీడీపీ..హిస్టరీ రిపీట్...?

By:  Tupaki Desk   |   25 March 2022 11:30 PM GMT
ఫార్టీ ఇయర్స్ టీడీపీ..హిస్టరీ రిపీట్...?
X
తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాలు. 1982 మార్చి 29న సాయంత్రం కేవలం నలభై మందితో ఒక చిన్న స్థాయి మీటింగ్ హైదరాబాద్ లో నాటి ప్రఖ్యాత తెలుగు సినిమా నటుడు ఎన్టీయార్ ఏర్పాటు చేశారు. ఆ వార్త ఆ రోజు ఆరు గంటల ఆకాశవాణి వార్తలలో చిన్నగా ప్రసారం అయింది. అంతే ఒక్కసారిగా దేశంలోనే దావానలంగా మారిపోయింది.

తెలుగుదేశం పార్టీ అలా పుట్టిన పార్టీ. ఎన్టీయార్ వెండి తెర వేలుపు కాస్తా జనాలకు సరికొత్త నాయకుడిగా అవతరించారు. టీడీపీ నాలుగు దశాబ్దాల రాజకీయమంతా ఒక చరిత్రగా చూడాలి. ముఖ్యంగా మొదటి పద్నాలుగేళ్లూ ఎన్టీయార్ టీడీపీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు.

ఎన్టీయార్ శకం టీడీపీలో ఒక అద్భుతం. ఆయన మాట, బాట అంతా కూడా ఒక రికార్డే . సరికొత్త ప్రభంజనమే. టీడీపీకి ఎన్టీయార్ ఒక బలం. ఆయన కొండంత అండ. ఇక ఎంన్టయార్ అనంతరం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ గత ఇరవై ఆరు ఏళ్ళుగా సాగుతోంది. చంద్రబాబు అందులో పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఎన్టీయార్ గ్లామర్ తో పార్టీని నడిపిస్తే చంద్రబాబు పొలిటికల్ గ్రామర్ తో ఇంతదాకా టీడీపీ ప్రస్థానాన్ని తీసుకువచ్చారు. ఎన్టీయార్ అభిమానులంతా టీడీపీలోనే ఉండేలా చూసుకున్నారు. పార్టీని ఇంకా పటిష్ఠం చేశారు. మొత్తానికి ఎన్టీయార్ ఒకసారి ఓడితే చంద్రబాబు మూడు సార్లు ఓడారు.

అయితే ఇపుడు టీడీపీకి కీలక సమయం. 2019 ఎన్నికల్లో ఓడిన పార్టీకి 2024 ఎన్నికలు ముఖ్యం. దానికి రెండేళ్ళ ముందే నలభయ్యవ మైలు రాయిని టీడీపీ దాటుతోంది. ఈ రాజకీయ మూలధనాన్ని, ఇంధనాన్ని ఉపయోగించుకుని రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికలలో విజయఢంకా మోగించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

అందుకే నలభయ్యేళ్ల టీడీపీ ఉత్సవాలని ఘనంతా నిర్వహించాలని చూస్తోంది. దానికి సంబంధించిన లోగోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీయార్ ఒక చరిత్ర. టీడీపీదీ అదే చరిత్ర. ఆయన పేదల కోసం పార్టీని పెట్టారు, బీసీలు టీడీపీని వెన్నుదన్ను అని పేర్కొన్నారు.

పార్టీ కోసం క్యాడర్ అంతా పునరంకితం అయ్యేలా నలభయ్యేళ్ళ వేడుకలను ఘనంగా ఊరూ వాడా నిర్వహించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. మొత్తానికి సరైన సమయానికి టీడీపీ హిస్టారికల్ ఈవెంట్ వచ్చింది. దాంతో 1983 నాటి హిస్టరీని రిపీట్ చేయాలని ఆ పార్టీ ఆశిస్తోంది ఆ దిశగా పయనిస్తోంది.