Begin typing your search above and press return to search.

40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు కొత్త పథకాలే తట్టలేదెందుకో?

By:  Tupaki Desk   |   7 Nov 2019 3:00 PM GMT
40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు కొత్త పథకాలే తట్టలేదెందుకో?
X
నారా చంద్రబాబునాయుడు... టీడీపీకి అధినేత గానే కాకుండా తెలుగు నేలలో అత్యధిక కాలం పాటు సీ ఎం కుర్చీ లో కూర్చున్న నేత గానే కాకుండా అత్యధిక కాలం విపక్షంలో కూర్చున్న నేత గానూ రికార్డుల కెక్కారు. ఈ క్రమం లోనే మొన్నటి ఎన్నికలకు ముందు తాను రాజకీయాల్లోకి ప్రవేశించి 40 ఏళ్లు పూర్తి అయిన వైనాన్ని తన పత్రికల చేత బాకాయి ఊదించి మరీ డబ్బా కొట్టేసుకున్నారు. అప్పటి నుంచే ఆయన తనను తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసుకుంటూ సాగుతున్నారు. అయితే ఏం లాభం.. రాజకీయాల్లో తన సమకాలీనులు, తనకంటే బాగా జూనియర్లు, తన కుమారుడి తో సమ వయస్సు ఉన్న నేతలతో కూడా చంద్రబాబు సరి తూగడం లేదన్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... తన సొంత బుర్రకు పదును పెట్టి... ఇన్నేళ్ల రాజకీయ జీవితం లో ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా ప్రవేశ పెట్టారా? అన్న దిశగా సాగుతున్న ఈ విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

చంద్రబాబు కు రాజకీయంగా సమకాలీనుడిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని చెప్పు కోవాలి. ఈ ఇద్దరు నేతలు కూడా ఒకే సారి రాజకీయాల్లోకి ప్రవేశించడంతో పాటు గా ఒకే పార్టీ తరఫున ఒకే సారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అంతేనా... ఎమ్మెల్యే గా తొలి సారిగా ఎన్నికైన నాడే వీరిద్దరు మంత్రులు గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వైఎస్ తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ లోనే కొనసాగగా... చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ ను వీడి టీడీపీ లో చేరి... ఆ పార్టీ వ్యవస్థాపకుడి గానే కాకుండా తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచేసి పార్టీని తన హస్తాల్లోకి లాగేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ కంటే చాలా ముందుగానే చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. చంద్రబాబు సీఎం అయిన పదేళ్ల కు గానీ వైఎస్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. అయినా కూడా వైఎస్ తరహా పాలనను సాగించడం లో చంద్రబాబు ఏనాడూ సక్సెస్ కాలేక పోయారని చెప్పక తప్పదు.

ఉమ్మడి రాష్ట్రం లో చంద్రబాబు జమానాకు చరమగీతం పాడిన వైఎస్... తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ తో పాటు ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ సేవ, ఫీజు రీయింబర్స్ మెంట్ లను ప్రారంభించారు. ఈ పథకాలు వైఎస్ కు జనం గుండెల్లో స్థిర స్థాయిని ఏర్పరచాయి. రాష్ట్రం, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వైఎస్ ఈ పథకాల ద్వారా ఖ్యాతి గడించారు. సరే... వైఎస్ అకాల మరణం, ఆ తర్వాత ఐధేళ్ల లోనే తెలుగు నేల రెండు రాష్ట్రాలు గా విడిపోవడంతో చంద్రబాబు 13 జిల్లాలలో కొత్తగా ఏర్పడిన ఏపీకి మాత్రమే సీఎం కాగలి గారు. 9 జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణకు ఒకప్పుడు బాబు అనుంగుడిగానే ముద్రపడిన కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వైఎస్ మాదిరిగా కాకపోయినా... కేసీఆర్ కూడా తనదైన శైలి పాలనతో ఆకట్టుకున్నారనే చెప్పక తప్పదు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతు బంధును ప్రవేశ పెట్టిన కేసీఆర్... దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలకే కాకుండా చివరికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారుకు కూడా ఆదర్శంగానే నిలిచారు.

ఇక పోతే... ఇప్పుడు నవ్యాంధ్రకు సీఎంగా పదవీ బాద్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... చంద్రబాబు కంటే చాలా చొన్నోడి కిందే లెక్క. అయితేనేం... రాష్ట్రం లో విద్యా వ్యవస్థలోని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలోనే ఆయన అమ్మ ఒడి పేరిట ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టేశారు. కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు మాదిరే రైతు భరోసాను కూడా పక్కా గానే అమలు చేసేస్తున్నారు. వివిధ కుల వృత్తులకు చెందిన వారికి ఆర్థిక సహాయం తో పాటుగా... రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించని రీతిలో సంక్షేమానికి శ్రీకారం చుట్టేశారు. తన కుమారుడి వయస్సున్న జగన్ ఇన్ని చేస్తున్నా... 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన చంద్రబాబు మాత్రం ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క కీలక పథకాన్ని కూడా చేపట్ట లేకపోయారు. ఇతరులు ప్రవేశ పెట్టిన పథకాలకు పేర్లు మార్చేసి, విధి విధానాలను అటూ ఇటూ చేసి నెట్టు కొచ్చారే తప్పించి... చంద్ర బాబు బుర్ర ఒక్కటంటే ఒక్క సొంత పథకానికి కూడా రూపకల్పన చేయలేక పోయిందనే చెప్పాలి. మొత్తంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... తన సమకాలీకులతో పాటు తన కుమారుడి వయస్సున్న నేతల ముందు కూడా దిగదుడుపుగానే మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.