Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఈగో విలువ రూ.4వేల కోట్లంట‌!

By:  Tupaki Desk   |   27 Nov 2017 5:52 AM GMT
కేసీఆర్ ఈగో విలువ రూ.4వేల కోట్లంట‌!
X
పాల‌కుడికి ఈగో ఉండటం త‌ప్పేం కాదు. కానీ.. దాని కార‌ణంగా ప్ర‌జ‌ల మీద వేలాది కోట్ల రూపాయిలు భారం ప‌డితేనే అస‌లు త‌ప్పంతా. ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద‌గా చ‌ర్చ‌కు రాని విష‌యాన్ని తెర మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. హైద‌రాబాద్ మెట్రో రైలు ఆల‌స్యంపై నోరు విప్పిన వారు ప్ర‌జ‌ల మీద ప‌డిన భారాన్ని ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.

తమ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు మొద‌లెట్టిన హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును కేసీఆర్ ఈగోతో ఆల‌స్యం చేశార‌ని.. అందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు ఆల‌స్యానికి బాధ్య‌త వ‌హించి ముఖ్య‌మంత్రి సారీ చెప్పాల‌ని.. వివిధ కార‌ణాల‌తో ఏడాదిన్న‌ర జాప్యం చేసినందుకు రూ.4వేల కోట్లు అద‌న‌పు భారం ప‌డేలా చేశార‌ని మండిప‌డుతున్నారు.

ఏదో గాలిని పోగేసి ఉత్త‌మ్ కుమార్ అండ్ కోలు మాట్లాడుతున్నార‌న‌టంలో అర్థం లేదు. ఎందుకంటే.. శనివారం నాగోల్ మెట్రో స్టేష‌న్లో మంత్రి కేటీఆర్ నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో.. ప్రాజెక్టు ఆల‌స్యం గురించి..రూ.4వేల కోట్ల భారం గురించి ఒక‌రిద్ద‌రు మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. ఎప్ప‌టిలానే కేటీఆర్ దానికి త‌న అధికార దూకుడుతో స‌మాధానం చెప్ప‌లేదు.

రూ.4వేల కోట్ల భారం ప‌డింది క‌దా? ఇప్పుడు ఆ భారాన్ని ఎవ‌రు మోస్తారు? దానికి బాధ్య‌త ఎవ‌రు వ‌హిస్తారంటూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ సూటిగా స్పందించ‌లేదు. త‌న‌దైన శైలిలో రూ.4వేల కోట్ల భారం ప‌డింద‌ని మీకు ఎవ‌రు చెప్పారు? ఎలా తెలుసు?.. అస‌లు మెట్రో రైల్ ప్రాజెక్టు వాల్యూ ఎంతని అనుకుంటున్నారు? అంటూ రివ‌ర్స్ గేర్ లో ప్ర‌శ్న‌లు వేశారే త‌ప్పించి..పాత్రికేయులు వేసిన ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌లేదు.

కాకుంటే ప్రాజెక్టు ఆల‌స్య‌మైంద‌న్న మాట‌ను రేఖా మాత్రంగా ఆయ‌న ఒప్పుకున్నారు. దాని వ‌ల్లఆర్థికంగా ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని స‌రైన స‌మ‌యంలో చెబుతామ‌ని.. ఇలా ప‌బ్లిక్ వేదిక మీద మాట్లాడ‌టం స‌రికాదంటూ వ్యాఖ్యానించారు. నిజానికి హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు.. ప‌బ్లిక్‌.. ప్రైవేటు ఉమ్మ‌డి భాగ‌స్వామ్యంలో నిర్వ‌హిస్తున్నది. ప‌బ్లిక్ అంటే.. ప్ర‌జా ధ‌నాన్ని వినియోగిస్తున్న‌ది. ప్ర‌జాధ‌నానికి సంబంధించిన లెక్క‌ను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వాల్ని ప్ర‌శ్నిస్తే.. తాము చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని.. టైం చూసుకొని చెబుతామంటూ వ్యాఖ్యానించ‌టం చూస్తే.. మంత్రి కేటీఆర్ మాట‌ల్లో అర్థం లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

కేటీఆర్ మాట‌ల్లో గుర్తించాల్సిన స‌త్యం ఏమిటంటే.. ప్రాజెక్టు ఆల‌స్యాన్ని ఆయ‌న తోసిపుచ్చ‌టం లేదు. అదే స‌మ‌యంలో భారానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల‌న్న మాట‌ను కొట్టిపారేయ‌టం లేదు. అంటే.. భారం వాస్త‌వం.. కానీ ఆ వివరాల్ని వెల్ల‌డించే విష‌యం మీద మాత్రం కేటీఆర్ అభ్యంత‌ర‌మంతా. ప్ర‌జ‌ల సొమ్ము ప‌క్క‌దారి ప‌ట్ట‌టం.. పాల‌కుల త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు మూల్యం చెల్లించాల్సి రావ‌టం చూస్తే.. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జ‌లెంత బ‌క‌రాలో ఇట్టే అర్థం కాక మాన‌దు. కార‌ణాలు ఏమైనా.. ఒక ముఖ్య‌మంత్రికి.. ఒక పెద్ద ప్రాజెక్టుకు మ‌ధ్య అంత‌రం వ‌చ్చి ఆల‌స్య‌మైతే.. దాని మూల్యం రూ.4వేల కోట్లు కావ‌టం ఒక ఎత్తు అయితే.. అదంతా కూడా స‌ద‌రు ముఖ్య‌మంత్రిని అభిమానించి.. ఆరాధించే ప్ర‌జ‌ల నెత్తి మీద ప‌డ‌టం అస‌లుసిస‌లు విషాదంగా చెప్ప‌క త‌ప్ప‌దు.