Begin typing your search above and press return to search.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఏపీలో ఏం చేస్తారంటే?

By:  Tupaki Desk   |   2 May 2020 5:45 AM GMT
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఏపీలో ఏం చేస్తారంటే?
X
మే మూడుతో ముగుస్తుందని భావించిన లాక్ డౌన్ 2.0ను మరో రెండువారాల పాటు పొడిగిస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇదే సమయంలో.. దేశంలో మూడు రకాల జోన్లను కేంద్రం గుర్తించింది. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన జోన్ గా రెడ్.. ఒక మోస్తరు నిబంధనల్ని సడలించే అవకాశం ఉన్న జోన్లను ఆరెంజ్ గా.. పెద్ద ఎత్తున సడలింపులకు అనువుగా గ్రీన్ జోన్లను ఎంపిక చేసింది. గడిచిన 21 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని ప్రాంతాల్ని దీని కిందకు చేర్చారు. ఇదిలా ఉంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు.. కార్మికుల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే విషయంలో కేంద్రం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వ్యూహాన్ని రెడీ చేసుకోవాలి.

ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తోంది. రాష్ట్రంలో ఉన్న కార్మికులు.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గుర్తించే కార్యక్రమంతో పాటు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని వారి గమ్యస్థానాలకు ఎలా చేర్చాలన్న దానిపైనా పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసింది. అదెలా అన్నది చూస్తే..
ఏపీలోని ఇతర జిల్లాల లో చిక్కుకున్న వలస కార్మికులు 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. కేవలం గ్రీన్ జోన్ నుండి గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి ఇస్తారు. రిలీఫ్ క్యాంప్ లో నుండి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు రాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో వస్తేనే వారిని బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. ఈ బస్సుల్లో కూడా సీట్లలో 50 శాతం మించకుండా తరలించేలా ఏర్పాట్లు చేస్తారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని వారి సొంతూళ్లలో పద్నాలుగు రోజులు క్వారంటైన్ చేయటంతో పాటు.. తర్వాత మరో పద్నాలుగు రోజులు హోం క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఏదైనా సమూహంలోని ఒకరికి పాజిటివ్ గా తేలితే.. ఆ సమూహం మొత్తాన్ని అక్కడే ఉంచేస్తారే తప్పించి.. వారిని తరలించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు.

పాజిటివ్ గా తేలిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. ఇక.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి సంబంధించి ఆ రాష్ట్రాల అధికారులతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్.. ఒక రైల్వే స్టేషన్ ను గుర్తిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని.. వారు వెళ్లాల్సిన జిల్లాకు సంబంధించిన నోడల్ అధికారికి సమాచారం ఇస్తారు.

అలా చేరుకున్న వారికి స్క్రీనింగ్ నిర్వహించి.. పూల్ పద్దతిలో కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే వారిని ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తారు. ఇతర రాష్ట్రాల్లోని రెడ్ జోన్.. కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. వారిని తొలుత పద్నాలుగు రోజులు క్వారంటైన్ కు పంపుతారు. ఆ తర్వాత పరీక్షలుజరిపిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. మొత్తంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఏపీకి వచ్చినా.. పక్కా ప్రొసీజర్ పూర్తి అయ్యాక మాత్రమే ఇళ్లకు చేరే అవకాశం ఉంటుందన్నది మర్చిపోకూడదు.