Begin typing your search above and press return to search.

ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై 420 కేసు పెట్టారు

By:  Tupaki Desk   |   2 Sep 2015 4:23 AM GMT
ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై 420 కేసు పెట్టారు
X
అధికారపక్షానికి చెందిన నేతలపై కేసులు పెట్టటం కాస్తంత తక్కువే. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిపై ‘‘420’’ కేసు బుక్ చేశారు. ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మంది మీదా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే.. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలే కారణంగా తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం.. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ విచారణ జరిపి.. ఆ ఆరోపణల్లో నిజం ఉందని తేలటమే కేసు నమోదు కారణంగా చెబుతున్నారు.

హరీశ్వర్ రెడ్డి గతంలో తెలుగుదేశంలో ఉండి.. ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ లో చేరి పరిగి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే.ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టినట్లుగా ఎన్నికల కమిషన్ విచారణలో తేలటంతో.. ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

ఎన్నికల సంఘం నివేదికతో సంతృప్తి చెందిన కోర్టు.. హరీశ్వర్ రెడ్డిపై కేసు నమోదుకు పచ్చ జెండా ఊపింది. దీంతో.. వరంగల్ జిల్లా పరిగి పోలీసులు ఆయనపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. మరి.. ఈ కేసు వ్యవహారం హరీశ్వర్ రెడ్డికి ఎన్ని తిప్పలు తీసుకురానుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.