Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరు కాంగ్రెస్ క్యాంప్ దుకాణం బంద్

By:  Tupaki Desk   |   6 Aug 2017 4:58 PM GMT
బెంగ‌ళూరు కాంగ్రెస్ క్యాంప్ దుకాణం బంద్
X
కాంగ్రెస్ క్యాంప్ దుకాణం బంద్ కానుంది. గ‌డిచిన కొద్ది రోజులుగా 44 మంది గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలోని ఈగ‌ల్ట‌న్ రిసార్ట్ లో క్యాంప్ రాజ‌కీయాన్ని నిర్వ‌హించ‌టం తెలిసిందే. జాతీయ స్థాయిలో సంచ‌ల‌నంగా మారిన ఈ క్యాంప్ రేప‌టి(సోమ‌వారం)తో బంద్ కానుంది. ఈ నెల 8న గుజ‌రాత్ రాష్ట్రంలో రాజ్య‌స‌భ ఎన్నికల్ని నిర్వ‌హిస్తున్నారు. మూడు రాజ్య‌స‌భ స్థానాల కోసం సాగుతున్న పోలింగ్ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు అధికార బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌టంతో కాంగ్రెస్ కు క‌రెంట్ షాక్ గా మారింది.

త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని కాపాడేందుకు వీలుగా గుజ‌రాత్ నుంచి ఆఘ‌మేఘాల మీద తాము అధికారంలో ఉన్న బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రానికి విమానంలో త‌ర‌లించారు. బెంగ‌ళూరులోని రిసార్ట్ లో క్యాంప్ రాజ‌కీయాల్ని షురూ చేయ‌గా.. ఐటీ అధికారులు ఒక్క‌సారిగా సోదాలు నిర్వ‌హించ‌టంతో కాంగ్రెస్ నేత‌లు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాయి. గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు అన్ని ఏర్పాట్లు చూస్తున్న క‌ర్ణాట‌క మంత్రి డీకే శివ‌కుమార్ ఇంట్లోనూ.. ఆయ‌న బంధువులు.. స్నేహితుల‌కు సంబంధించిన ఆస్తుల మీద దాదాపుగా నాలుగు రోజుల పాటు నాన్ స్టాప్ గా సోదాలు నిర్వ‌హించారు.

ఈ మొత్తం ఎపిసోడ్ సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా ఉంటే.. గుజ‌రాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా త‌మ‌కు బీజేపీ రూ.15కోట్ల ఆఫ‌ర్ చేస్తూ ఫిరాయింపుల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. త‌మ పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి రూ.15కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్లుగా చెప్పారు.

ఫిరాయింపుల‌కు ప్రోత్స‌హించ‌టంతో పాటు.. బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం చేస్తుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పార్మ‌ర్ ఈ మ‌ధ్య‌న ఆరోపించారు కూడా. త‌మ ఎమ్మెల్యేల్ని కాపాడుకోవ‌టం కోస‌మే బెంగ‌ళూరులో క్యాంపు నిర్వ‌హించామే త‌ప్పించి మ‌రో కార‌ణం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం కీల‌క పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సోమ‌వారం బెంగ‌ళూరు రిసార్ట్ క్యాంప్ దుకాణాన్ని బంద్ చేయ‌నున్నారు. బెంగ‌ళూరు నుంచి గుజ‌రాత్ కు వెళ్లి.. పోలింగ్ లో పాల్గొన‌నున్నారు.

తాజాగా గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో అమిత్ షా.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న బ‌ల్వంత్ సింగ్ రాజ్ పుత్ బ‌రిలో ఉన్నారు. ఇక‌.. కాంగ్రెస్ నుంచి పార్టీ అధినేత్రి సోనియాకు రాజ‌కీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించే అహ్మ‌ద్ ప‌టేల్ బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థి విజ‌యం సాధించాలంటే 44 మంది ఎమ్మెల్యేల అవ‌స‌రం ఉంటుంది. గుజ‌రాత్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మొత్తం 57 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా వేసుకొని బీజేపీలోకి వెళ్లిపోవ‌టంతో కాంగ్రెస్ బ‌లం 51కు త‌గ్గిపోయింది. ఒక‌వేళ‌.. క్రాస్ ఓటింగ్ జ‌రిగితే మాత్రం అహ్మ‌ద్ ప‌టేల్‌కు భారీ షాక్ త‌ప్ప‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.