Begin typing your search above and press return to search.

అక్క‌డ ముస్లిం అభ్య‌ర్థుల్ని న‌మ్ముకున్న బీజేపీ

By:  Tupaki Desk   |   18 May 2017 9:50 AM GMT
అక్క‌డ ముస్లిం అభ్య‌ర్థుల్ని న‌మ్ముకున్న బీజేపీ
X
ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి అన్న చందంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది మోడీ ప‌రివారం. దేశ వ్యాప్తంగా కాషాయ జెండా రెప‌రెప‌లాడాల‌ని క‌మ‌ల‌నాథులు కోరుకుంటున్నారు. త‌మ ఆశ‌యంలో భాగంగా ప్ర‌తి ఎన్నిక‌ల్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నారు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా త‌మ బలాన్ని ప్ర‌ద‌ర్శించే ఏ ఎన్నిక‌ను బీజేపీ వ‌దులుకోవ‌టం లేదు. తాజాగా మ‌హారాష్ట్రలోని మాలేగాం మున్సిపాలిటీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో అధికార‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ.. ఈసారి ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

మాలేగాం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో మొత్తం 80 స్థానాల్లో అత్య‌ధిక భాగం కాంగ్రెస్‌ కు కంచుకోట. ఇప్ప‌టికే దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కు చుక్క‌లు చూపించిన నేప‌థ్యంలో.. ఎంత‌కూ కొరుకుడుప‌డ‌ని మాలేగాంలో కాషాయ‌జెండాను ఎగిరేలా చేయాల‌ని క‌మ‌ల‌నాథులు కంక‌ణం క‌ట్టుకున్నారు.అయితే.. ఇప్ప‌టికే మాలేగాంలో చేదు అనుభ‌వం ఎదురైన నేప‌థ్యంలో ఈసారి ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ గాలి వీస్తున్న వేళ‌.. మాలేగాం కార్పొరేష‌న్‌ ను సొంతం చేసుకోవ‌టానికి వీలుగా రికార్డుస్థాయిలో ముస్లిం అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌క‌టించిన 77 స్థానాల అభ్య‌ర్థుల్లో 45 మంది ముస్లిం అభ్య‌ర్థులే కావ‌టం విశేషం. 2012లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ 24 మంది అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపిన‌ప్ప‌టికీ వారంతా ఓడిపోయారు. వీరిలో 12 మందికి అయితే డిపాజిట్లు కూడా ద‌క్క‌ని దుస్థితి.

ఈ నేప‌థ్యంలో ఈసారి ఆచితూచి అభ్య‌ర్థుల ఎంపిక జ‌రిపిన‌ట్లుగా చెబుతున్నారు. మే 24న జ‌రిగే ఈ ఎన్నిక‌ల మీద మ‌హారాష్ట్ర బీజేపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. మ‌రోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ ప‌ట్టును చేజార్చుకోకూడ‌ద‌ని భావిస్తోంది. ఈసారి మ‌జ్లిస్ కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌టంతో ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద ఆస‌క్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/