Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో కొండంత విషాదం..46 మంది బ‌లి

By:  Tupaki Desk   |   14 Aug 2017 5:03 AM GMT
ఆ రాష్ట్రంలో కొండంత విషాదం..46 మంది బ‌లి
X
ఊహించ‌ని రీతిలో చావువార్త‌లు నిత్యం వినాల్సి వ‌స్తోంది. గ‌డిచిన కొద్ది రోజులుగా మ‌ర‌ణం మ‌రింత మామూలుగా మారింది. మ‌నిషి చేసే త‌ప్పుల‌కు ప్రాణాలు పోవ‌టం ఒక ఎత్తు.. ఎలాంటి పొర‌పాటు లేకున్నా అదే ప‌నిగా పోతున్న ప్రాణాల వార్త‌లు వింటున్న దేశ వాసులు తీవ్ర నిరాశ‌కు గురి అవుతున్నారు. మొన్న‌నే యూపీలోని గోర‌క్ పూర్ ప్ర‌భుత్వ ద‌వాఖానా దుస్థితి గురించి తెలిసిందే.

ఆక్సిజ‌న్ అంద‌క ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోగొట్టుకోవ‌టం ప‌సి ప్రాణాలు పోవ‌టం అంద‌రిని క‌లిచివేసింది. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే మ‌రో విషాదం క‌మ్మేసింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో చోటు చేసుకున్న పెను ప్ర‌మాదంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు చెందిన రెండు బ‌స్సుల మీద భారీ కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డ్డాయి. ఈ దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లో 46 మంది అమాయ‌కుల ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు కూడా మృతి చెందిన‌ట్లుగా చెబుతున్నారు.

మండి - ప‌ఠాన్ కోట్ జాతీయ ర‌హ‌దారిలోని కోత్ పురి వ‌ద్ద ఈఘోర ప్ర‌మాదం జ‌రిగింది. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బ‌య‌ట‌కు తీసేందుకు ఎన్ డీఆర్ ఎఫ్‌.. ఆర్మీ..పోలీసు బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు షురూ చేశాయి. ఘ‌ట‌నా స్థ‌లాన్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వీర‌భ‌ద్ర సింగ్ సంద‌ర్శించి.. స‌హాయ‌క చ‌ర్య‌లు ఆఖ‌రి వ‌ర‌కూ ఆగుతాయ‌న్నారు. ఇంత‌కీ ఇంత దారుణం ఎలా జ‌రిగిందో తెలిస్తే నోట మాట రాదంతేన‌ని చెప్పాలి. హిమాచ‌ల్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు చెందిన రెండు బ‌స్సుల్లో ఒక‌టి మ‌నాలి నుంచి కాత్రాకు.. మ‌రో బ‌స్సు మ‌నాలి నుంచి చంబాకు బ‌య‌లుదేరింది. అర్థ‌రాత్రి టీ విరామం కోసం బ‌స్సుల్ని నిలిపారు. అదే వేళ‌లో ఊహించ‌ని రీతిలో పెద్ద పెద్ద కొండ‌రాళ్లు విరిగి బ‌స్సుల మీద ప‌డ‌టంతో బ‌స్సుల్లో ఉన్న వారంతా నుజ్జు నుజ్జు అయ్యారు. వారి మృత‌దేహాల్ని సైతం గుర్తించ‌లేనంత దారుణంగా ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. హ‌టాత్తుగా విరిగి ప‌డిన కొండ చ‌రియ‌ల‌తో బ‌స్సులు 800 మీట‌ర్ల లోతున లోయలో ప‌డ్డాయి. వాహ‌నాల మీద ప‌డిన కొండ చ‌రియ‌ల ప్ర‌భావానికి చుట్టుప‌క్క‌ల ఉన్న ప‌లు ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ త‌న సంతాపాన్ని ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామ‌న్న మాట‌ను చెప్పారు. ఈ త‌ర‌హాలో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డి భారీ ప్రాణ న‌ష్టం చోటు చేసుకోవ‌టం ఇదే తొలిసారి కాద‌ని చెబుతున్నారు. 1988లో సిమ్లాజిల్లాలోని మ‌తియానాలో కొండ చ‌రియ‌లు విరుచుకుప‌డ‌టంతో 45 మంది మ‌ర‌ణించ‌గా.. 1994లో కులు జిల్లాలోని లుగ్గార్ హ‌తీలో 42 మంది ప్ర‌యాణికులు మృత్యువాత ప‌డ్డారు.