Begin typing your search above and press return to search.

అమ్మ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్!

By:  Tupaki Desk   |   3 Oct 2016 4:22 AM GMT
అమ్మ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్!
X
అన్నాడీఎంకే అధినేత్రి - తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యంపై విపరీతమైన పుకార్లు రావడం - పోలీసులు కేఉలు పెట్టడం కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి కూడా సీఎం ను ప్రజలకు చూపించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో ఆమెకు చికిత్స అందిస్తున్నామని, బాలే ట్రీట్ మెంట్ తో ఆవిడ కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆయన సలహాలతో ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నామని, వైద్య పరీక్షల నివేదికలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి - అపోలో సీనియర్ వైద్యులతో చర్చించి చికిత్స అందిస్తున్నారని వివరించారు. జయలలితకు ఇన్‌ ఫెక్షన్‌ ను తగ్గించే ఔషధాలను ఇస్తున్నామని, ఈ ట్రీట్ మెంట్ కు ఆమె స్పందిస్తున్నారని, ఆమె మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.

కాగా, సెప్టెంబరు 21 రాత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన నాలుగో హెల్త్‌ బులెటిన్‌ ఇది. ముఖ్యమంత్రికి అందిస్తున్న చికిత్సల పట్ల లండన్ లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రికి చెందిన అంతర్జాతీయస్థాయి వైద్య నిపుణుడు రిచర్డ్‌ బీలే సంతృప్తి వ్యక్తంచేశారని ఈ బులెటిన్‌ లో పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైద్యులు ఈ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ నాయకురాలు ఆస్పత్రిలో చేరి సుమారు రెండువారాలు కానుండం, ఆమె ఆరోగ్యంపై ఆస్పత్రి నుంచి మూడు హెల్త్‌ బులెటిన్ లే రావడంతో ఆదివారం వరకు కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా నాలుగో బులెటిన్‌ విడుదల చేసి అమ్మ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని చెప్పడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/