Begin typing your search above and press return to search.

కరోనాకు సంబంధించిన '5' కీలక అప్డేట్స్

By:  Tupaki Desk   |   4 Jan 2022 5:30 AM GMT
కరోనాకు సంబంధించిన 5 కీలక అప్డేట్స్
X
అదిగో వచ్చేస్తుంది.. ఇదిగో వచ్చేస్తుందంటూ జరిగిన ప్రచారానికి భిన్నంగా.. మూడో వేవ్ ముంచుకొచ్చింది. అంచనాలకు భిన్నంగా.. అనూహ్యంగా వచ్చేసిన మూడో వేవ్ ఇప్పుడు ముంగిట్లోకి వచ్చింది. దీని ప్రభావం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కేవలం వారం వ్యవధిలో దేశంలో పెరుగుతున్న కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నాలుగురోజుల క్రితం మూడో వేవ్ వచ్చేసిందని నిపుణులు హెచ్చరికలు నిజమన్న విషయం తాజా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతున్నాయి.

వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. వీరిలో రాజకీయ నేతలు.. సినీ.. క్రీడారంగానికి చెందిన వారితో పాటు.. వివిధ రంగాలకు చెందిన వారు ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక వాద్రా కుటుంబంలోని ఒకరికి.. తన సిబ్బందిలో మరొకరికి కరోనా పాజిటివ్ గా తేలటంతో ఆమె స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. తాను టెస్టు చేసుకున్నానని.. నెగిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల అనంతరం మరోసారి పరీక్ష చేసుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా పాజిటివ్ గా తేలింది. పలువురు బాలీవుడ్ కు చెందిన వారు కరోనా బారిన పడ్డారు.

1. మరోసారి ముంబయిలో భారీ కేసులు

మొదటి.. రెండో వేవ్ ల సందర్భంగా భారీగా కరోనా కేసులు నమోదైన ముంబయి మహానగరం మూడోవేవ్ లోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. తాజాగా ఒక్క రోజు (సోమవారం) లోనే 8,062 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 90 శాతం మంది బాధితుల్లో రోగ లక్షణాలు కనిపించలేవని పేర్కొన్నారు. అదే సమయంలో ఇద్దరు కొవిడ్ తో మరణించారు.

2. గోవాకు వెళ్లిన క్రూజ్ లో 66 మందికి కరోనా

ముంబయి నుంచి గోవాకు వెళ్లిన ఒక కార్డెలియా క్రూజ్ లో కరోనా కలకలం ఇప్పుడు ఆందోళనగా మారింది. దాదాపు 2 వేల మందికి పైగా ప్రయాణికులున్న ఈ భారీ నౌకలో పరీక్షలు చేయగా 66 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. క్రూజ్ నుంచి ఎవరినీ బయటకు అనుమతించటం లేదు. దీంతో.. నౌకలో ఉన్న వారిని ఏం చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.

3. ఆ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు.. తెలంగాణలో ఎప్పుడంటే?

కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. గోవా ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. ఈ నెల 26 వరకు స్కూళ్లు.. కాలేజీలు మూసివేయాలని నిర్ణయించింది. త్వరలోనే రాత్రి వేళ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఒక్క రోజులోనే గోవాలో పాజిటివిటీ రేటు 10.7శాతంగా నమోదు కావటం గమనార్హం. పశ్చిమబెంగాల్ లో ఇప్పటికే విద్యా సంస్థల్ని మూసివేయటం తెలిసిందే. తెలంగాణ విషయానికి వస్తే.. మంగళవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్ని విద్యా సంస్థలు ఈ నెల 8 నుంచి సెలవులు ఇవ్వాలని పేర్కొన్నారు. ముందుగా అనుకున్న దాని కంటే మూడురోజుల ముందే సెలవుల్ని ప్రకటించటం చూస్తే.. కరోనా కేసుల విస్తరణ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

4. బిహార్ లో కరోనా కలకలం మామూలుగా లేదుగా

బిహార్ రాష్ట్రంలో కరోనా కలకలం భారీగా ఉంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించే జనతా దర్బార్ కరోనా వ్యాప్తికి వేదికగా మారింది. మొత్తం 14 మంది పాజిటివ్ గా తేలారు. పాట్నాలో నిర్వహించిన ఈ దర్బార్ లో విధులు నిర్వర్తించిన ముగ్గురు కానిస్టేబుళ్లు.. ఐదుగురు భోజనం వడ్డించే సిబ్బందికి.. మరో ఆరుగురు ఫిర్యాదీలకు కరోనా సోకినట్లు తేలింది. అంతేకాదు.. పట్నాలోని నలంద వైద్య కళాశాలలో 87 మంది వైద్యులు కరోనా బారిన పడిన వైనం కలకలంగా మారింది. ఇలా.. బిహార్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.

5. తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయ్.. సోమవారం ఎన్నంటే?

థర్డ్ వేవ్ మొదలైనట్లేనంటూ అంచనాలు వచ్చిన వేళ.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల స్థాయిలో కాకున్నా.. ఒక మోస్తరుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొంతకాలం క్రితం వరకు రోజుకు వంద కేసులు రావటమే ఎక్కువగా ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు 500 కేసుల వరకు వచ్చేశాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కేసులు నమోదయ్యాయి. మొన్నటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ డిజిట్ దాటని పరిస్థితి. అందుకు భిన్నంగా వారం వ్యవధిలో రోజుకు మూడు వందల కేసుల స్థాయికి రావటం గమనార్హం. జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక కేసులు రంగారెడ్డిలో 55, మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలో 48 కేసులు నమోదు కావటం గమనార్హం.