Begin typing your search above and press return to search.

ఏం ఎన్నికలో ఏమో.. ఆ బిజినెస్ కు భారీగా దెబ్బ పడిందట

By:  Tupaki Desk   |   24 Jan 2022 4:34 AM GMT
ఏం ఎన్నికలో ఏమో.. ఆ బిజినెస్ కు భారీగా దెబ్బ పడిందట
X
ఎన్నికలు అన్నంతనే మిగిలిన సందడి ఎలా ఉన్నా.. ప్రముఖులు ప్రయాణించటానికి వీలుగా ప్రైవేటు చాపర్లకు మస్తు డిమాండ్ ఏర్పడుతుంది. అందునా.. మోడీ జమానా వచ్చిన తర్వాత బీజేపీ ఏదైనా రాష్ట్రంలో బరిలో ఉండి.. సీరియస్ గా గెలుపు ప్రయత్నాలు చేస్తుంటే.. దేశ రాజధాని ఢిల్లీ మొదలు.. ఆ పార్టీ అధికారంలోఉన్న ప్రతి రాష్ట్రం నుంచి పలువురు నేతలు ప్రైవేటు జెట్లు వేసుకొని.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రానికి వెళ్లి కమ్మేయటం.. పార్టీ తరఫున ప్రచారం చేయటం తెలిసిందే. దీని పుణ్యమా అని మిగిలిన వ్యాపారాల సంగతి ఎలా ఉన్నా.. ప్రైవేటు జెట్ లను అద్దెకు ఇచ్చే వారికి మూడు పువ్వులు.. ఆరు కాయలన్నట్లుగా వ్యాపారం జరిగేది.

కరోనా మూడో వేవ్ వేళ.. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల వేళ.. ప్రైవేట్ జెట్లు..హెలికాఫ్టర్లు అద్దెకు ఇచ్చే వారికి భారీగా దెబ్బ పడిందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం పరిమితులు విధించటం.. తాజాగా ఆ పరిమితుల్ని ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపత్యంలో.. ప్రత్యేక విమానాల అవసరమే పడటం లేదంటున్నారు. మామూలు రోజుల్లో అయితే.. ఈ తరహా ఎన్నికలు జరుగుతుంటే.. ప్రైవేటు జెట్ల కోసం భారీ పోటీ నడవటమే కాదు.. ప్రీమియం ఫీజులు చెల్లించి మరీ విమానాల్ని బుక్ చేసుకునే పరిస్థితి.

అందుకు బిన్నంగా తాజాగా మాత్రం అద్దెకు విమానాల్ని అడిగేవారే ఉండటం లేదంటున్నారు. మూడోవేవ్ కారణంగా ప్రచారం పెద్దగా లేకపోవటం.. ఈసీ ఆంక్షల నేపథ్యంలో ప్రచారం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం కంటే.. ఎవరికి వారు తమ ప్రచార సరళిని పూర్తిగా మార్చేశారు. సాధారణంగా ఏదైనా పెద్ద రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి నెల ముందు నుంచే ప్రైవేటు జెట్లను బుక్ చేసుకోవటం ఎక్కువగా ఉండేది. కానీ.. కరోనా మూడో వేవ్ అలాంటి అవకాశమే లేకుండా చేసిందన్న మాట వినిపిస్తోంది.

ర్యాలీలు.. సభలు.. సమావేశాలపై ఈసీ ఆంక్షల్ని విధించటంతో విమానాల్ని అద్దెకు తీసుకునే వారే కరువయ్యారని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు.. ఎన్నికల సంఘ అధికారులు సైతం విమాన ప్రయాణాల్ని బాగా తగ్గించుకుంటూ.. వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షలు జరుపుతుండటంతో.. విమానయాన సంస్థలు కరోనా మహ్మమారిని తిట్టుకునే పరిస్థితి. కంటికి కనిపించని ఈ మహమ్మారి.. తమను భారీగా దెబ్బేసిందన్న మాటను విమానయాన సంస్థలు చెబుతున్నాయి.