Begin typing your search above and press return to search.

అవనిగడ్డ సభకు 500 బస్సుల్లో డ్వాక్రా మహిళలు.. తర్వాతేమైంది?

By:  Tupaki Desk   |   21 Oct 2022 4:36 AM GMT
అవనిగడ్డ సభకు 500 బస్సుల్లో డ్వాక్రా మహిళలు.. తర్వాతేమైంది?
X
క్రిష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. విశాఖలో తమ పార్టీ నేతలు నిర్వహించిన గర్జన కార్యక్రమానికి పెద్దగా జనాలు హాజరు కాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. అవనిగడ్డలో నిర్వహించిన సభకు భారీగా జనాల్ని తరలించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అధికారపక్ష నేతలు.

అందులో భాగంగా ముందస్తు ప్లానింగ్ చేసి.. దగ్గర దగ్గర 500 బస్సుల్లో డ్వాక్రా మహిళల్ని సభా వేదిక వద్దకు తరలించారు. ఇదంతా బాగానే ఉన్నా.. సభ వద్ద వారికి అవసరమైన కనీస ఏర్పాట్లు చేయకపోవటంతో నరకాన్ని చూసిన దుస్థితి.

ఎందుకిలా? అంటే.. సభ వద్దకు భారీగా మహిళల్ని తీసుకురావటంపై పెట్టిన ఫోకస్.. వారు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని అధికార వైసీపీ నేతలకు పట్టకపోవటమే దీనికి కారణంగా చెప్పాలి. ఇటీవల కాలంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణ వేడి కంటే ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత కూడా అధికమన్న సంగతి తెలిసిందే.

వైసీపీ నేతల ప్లానింగ్ లో భాగంగా భారీగా మహిళల్ని సమీకరించే విషయంలో సక్సెస్ అయినప్పటికీ.. వారు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తల్ని తీసుకోకపోవటంతో నానా ఇబ్బందులకు గురయ్యారు. పలువురు మహిళలు.. చంటిపిల్లల తల్లులు సభావేదిక వద్ద ఉండలేని పరిస్థితి.

దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక ముందే సభా స్థలి వద్ద నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి పోలీసులు వారిని సముదాయించారు. కొందరు మహిళలు మాత్రం.. ఉక్కపోతతో చచ్చిపోవాలా? అంటూ మండిపడుతూ అక్కడ నుంచి వెళ్లారు.

తీవ్రమైన ఎండ.. ఉక్కపోత కారణంగా సభకు వచ్చిన వారిలో ఐదుగురు మహిళలు.. ఒక పెద్ద వయస్కుడు స్పృహ కోల్పోయారు. దీంతో వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీగా కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా అవనిగడ్డ సభ జరిగిందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.