Begin typing your search above and press return to search.

వారానికి 5 రోజులే పని దినాలు.. ఆ సీఎం సంచలనం

By:  Tupaki Desk   |   28 March 2022 8:30 AM GMT
వారానికి 5 రోజులే పని దినాలు.. ఆ సీఎం సంచలనం
X
వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే సౌలభ్యం ఐటీ కంపెనీల్లోచాలా ఎక్కువగా కనిపిస్తుండటం తెలిసిందే. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇదే విధానాన్ని అమలు చేస్తే? ఊరించే ఇలాంటి నిర్ణయాన్ని తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది మణిపూర్ సర్కార్. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. ఏజెన్సీలు.. ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇక నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకే పని చేయనున్నాయి. ఇటీవల మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీరెన్ సింగ్ తాజా నిర్ణయాన్ని వెల్లడించారు.

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క వెకేషన్ శాఖకు తప్పించి.. మిగిలిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పని వేళల్లోనూ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మార్చి నుంచి అక్టోబరు వరకు ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగనున్నాయి.

అయితే.. నవంబరు నుంచి మొదలయ్యే శీతాకాలాన్ని పరిగణలోకి తీసుకొని ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం మాత్రం మరో అరగంట ముందే ముగిసేలా నిర్ణయం తీసుకున్నారు.

ఇక.. ఎప్పటిలానే మధ్యలో వచ్చే లంచ్ బ్రేక్ కు మాత్రం అరగంట సమయం ఇచ్చారు. ఏమైనా.. వారానికి ఐదు రోజుల పని విధానం ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురుగా చెప్పక తప్పదు.

మరి.. తమ రాష్ట్రంలో మాదిరి మరే రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తామనే తెలంగాణ సీఎం కేసీఆర్.. తమ ప్రభుత్వ ఉద్యోగుల పని దినాల్ని ఆరు నుంచి ఐదు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకోగలరా? అన్న ప్రశ్న వినవస్తోంది.