Begin typing your search above and press return to search.

నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌.. జ‌గ‌న్ దూకుడు...!

By:  Tupaki Desk   |   20 July 2019 6:44 AM GMT
నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌.. జ‌గ‌న్ దూకుడు...!
X
వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. త‌న దూకుడును ఏ మాత్ర‌మూ త‌గ్గించ‌లేదు. సీఎంగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా వేలు పెట్టి చూపించే ప‌రిస్థితి లేకుండానే జ‌గ‌న్ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలో ఆయ‌న చూపిస్తున్న దూకుడు అన్ని వ‌ర్గాల‌ను ముక్కుమీద‌ వేలు వేసుకునేలా చేస్తోంది. త‌న కేబినెట్‌లో 60% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు పొందారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు కూడా పెద్ద‌పీట వేశారు.

ఉప ముఖ్య‌మంత్రిగా, రాష్ట్ర హోం మంత్రిగా కూడా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చిన జ‌గ‌న్‌.. త‌న‌కు సాటి.. పోటీ లేర‌ని నిరూపించుకున్నారు. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల నియామ‌క ప‌రంప‌ర‌కు తెర‌లేవ‌నుంది. ఈ క్ర‌మంలో కూడా జ‌గ‌న్‌త‌న‌దైన ముద్ర వేసుకునేందుకు, విమ‌ర్శ‌కుల నోటికి తాళం వేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కోటా అమ‌లు చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. నామినేటెడ్ పోస్టులు స‌హా కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు 50% రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

ఈ మేర‌కు తాజాగా నిర్వ‌హించిన కేబినెట్ భేటీలో జ‌గ‌న్ ఆమోద ముద్ర వేశారు. దీని ప్ర‌కాశం రాష్ట్రంలోని కార్పొరేష‌న్లు, బోర్డులు, సొసైటీలు, ట్ర‌స్టులు, మార్కెట్ యార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీమైనార్టీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డుతుంది. అదే స‌మ‌యంలో హిందూ దేవాల‌యాల‌లోనూ 50 శాతం పోస్టుల‌ను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల‌కే కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా కాంట్రాక్టుల‌ను మ‌హిళ‌ల‌కు అప్ప‌గించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజానికి ఇదే జ‌రిగితే, రాష్ట్రం లో ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, వైసీపీకి 30 కాదు 50 ఏళ్ల‌యినా తిరుగు అనేది ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సీఎంగా ప్ర‌మాణం చేయ‌క‌ముందు, పాద‌యాత్ర స‌మ‌యంలోనూ జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌క్షాళ‌న దిశ‌గా త‌న పాల‌న ఉంటుంద‌ని అన్న‌ట్టుగానే ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తి అడుగును, ఆదిశ‌గానే వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల్లోని పేద‌ల‌కు ఫ‌లాలు అందించేందుకు రెడీ అయ్యార‌నే విష‌యం తాజాగా తీసుకున్న నిర్ణ‌యాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.