Begin typing your search above and press return to search.

ఏపీ సీడ్స్ విష‌వాయువు.. ప‌దే ప‌దే అదే ముప్పు!

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:31 AM
ఏపీ సీడ్స్ విష‌వాయువు.. ప‌దే ప‌దే అదే ముప్పు!
X
ఏపీలోని అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లి (సెజ్)లోని సీడ్స్ దుస్తుల కంపెనీలో మ‌రోమారు విష‌వాయువు లీకైంది. తయారీ యూనిట్‌లో గ్యాస్ లీక్ కావడంతో 50 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. కార్మికులందరూ మహిళలే. ఆ విష‌వాయువును పీల్చిన‌వారంతా వికారంతో వాంతులు చేసుకున్నారు. దీంతో మ‌హిళా కార్మికుల‌ను సెజ్‌లోనే ఉన్న వైద్య కేంద్రంలో చేర్చి ప్రాథ‌మిక చికిత్స చేశారు. ఆ త‌ర్వాత వారిని హుటాహుటిన ఆస్ప‌త్రులకు త‌ర‌లించారు.

ఈ ఏడాది జూన్ 3న కూడా సీడ్స్ దుస్తుల కంపెనీలోనే విష‌వాయువు లీకై 469 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌యిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆగ‌స్టు 2న మంగ‌ళ‌వారం రాత్రి ఏడు గంట‌ల‌కు బి షిప్టులో ప‌నిచేస్తున్న 150 మ‌హిళా ఉద్యోగులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

గాఢ విష‌వాయువు విడుద‌ల కావ‌డంతో మ‌హిళా కార్మికులంతా శ్వాస అంద‌క ఉక్కిరిబిక్కిర‌య్యారు. దీంతో ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌లు సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. బాధితుల‌కు ప్రాథ‌మిక చికిత్స అందించాక‌.. కంపెనీ అంబులెన్సులు, ఇత‌ర వాహ‌నాల్లో అచ్యుతాపురం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కార్మికులను సెజ్‌లోని మెడికల్ సెంటర్‌లో ప్రథమ చికిత్స చేసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

అయితే అచ్యుతాపురం ఆస్ప‌త్రిల్లో ఆక్సిజ‌న్ స‌దుపాయం లేక‌పోవ‌డంతో మ‌హిళా కార్మికులు ప్రాణ‌భ‌యంతో కేక‌లు పెట్టారు. వీరిలో ఊపిరి అంద‌నివారిని అంబులెన్సుల్లో అన‌కాప‌ల్లిలోని ప‌లు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

మ‌రోవైపు స‌మాచారం అందుకున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ యంత్రాంగం ప్ర‌భుత్వ వైద్యుల‌ను సెజ్ వ‌ద్ద‌కు పంపలేద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం అచ్యుతాపురంలో 40 మంది కార్మికుల‌కు చికిత్స అంద‌జేస్తున్నారు. మిగిలిన 110 మంది అన‌కాప‌ల్లి ఆస్ప‌త్రుల్లో చికిత్ప పొందుతున్నారు.

గ‌తంలో ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు జాయింట్ క‌లెక్ట‌ర్ ఆధ్వర్యంలో విచార‌ణ క‌మిటీని వేశారు. అయితే ఇంత‌వ‌ర‌కు ఆ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్ట‌లేదు. విష వాయువు ఎలా లీకైంది? ఎక్క‌డ నుంచి నుంచి లీకైంది అనే వివ‌రాలేవీ బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోమారు ఇప్పుడు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో కార్మికులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.