Begin typing your search above and press return to search.

భార‌తీయులు వాడిన యాంటిబ‌యోటిక్స్ మాత్ర‌లు 500 కోట్లు.. ఇదే అత్య‌ధికం!

By:  Tupaki Desk   |   8 Sep 2022 8:33 AM GMT
భార‌తీయులు వాడిన యాంటిబ‌యోటిక్స్ మాత్ర‌లు 500 కోట్లు.. ఇదే అత్య‌ధికం!
X
మ‌న‌కు ఏదైనా సుస్తీ చేస్తే ముందు ఒక‌టి రెండు రోజులు శ‌రీరాన్ని స‌హ‌జ‌సిద్ధంగా పోరాడ‌నివ్వాల‌ని అంటారు. స‌హజ రోగ నిరోధ‌క శ‌క్తితోపాటు మ‌న ఒంట్లోని తెల్ల ర‌క్త క‌ణాలు వైర‌స్‌పై పోరాడ‌తాయ‌ని వైద్యులు కూడా చెబుతుంటారు. ఆ త‌ర్వాత కూడా జ‌బ్బు త‌గ్గ‌క‌పోతే ఆస్ప‌త్రికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఒకేసారి ఓవ‌ర్ డోస్ మందులు అవి వేసుకోకూడ‌దు. కేవ‌లం నార్మ‌ల్ మందులే వాడాల్సి ఉంటుంది.

అయితే వెంట‌నే త‌గ్గిపోతుంద‌నే కార‌ణం, మెడిక‌ల్ కంపెనీల‌కు మంచి చేయాల‌నే తాప‌త్ర‌యం తదిత‌ర కార‌ణాల‌తో ప్ర‌జ‌లు రోగాల బారిన‌ప‌డి ఆస్ప‌త్రుల‌కు వెళ్తే వైద్యులు ముందు యాంటీబ‌యోటిక్స్ రాసేస్తున్నారు. ఇలా యాంటిబ‌యోటిక్స్ విచ్చ‌ల‌విడి వాడ‌కంతో మ‌న‌లో ఉండే స‌హ‌జ రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుంద‌ని.. దీంతో కొన్నాళ్ల‌కు యాంటిబ‌యోటిక్స్ కూడా లొంగ‌ని విధంగా వ్యాధులు త‌యార‌వుతార‌ని అంటున్నారు.

తాజాగా భార‌తీయులు విప‌రీతంగా యాంటిబ‌యోటిక్స్ వాడేస్తున్నార‌ని వెల్ల‌డైంది. ఈ మేర‌కు ప్ర‌ముఖ వైద్య ప‌త్రిక లాన్సెట్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. ఒక్క 2019లోనే భార‌తీయులు 500 కోట్ల యాంటిబ‌యోటిక్స్ మాత్ర‌ల‌ను వినియోగించార‌ని బాంబుపేల్చింది. ఈ మేర‌కు లాన్సెట్‌ రీజనల్‌ హెల్త్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా అనే జర్నల్ చెబుతోంది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని తాజాగా విడుదల చేసింది.

లాన్సెట్ త‌న అధ్య‌య‌నంలో భాగంగా దేశవ్యాప్తంగా 9 వేలమంది మెడిక‌ల్ షాపుల‌ నుంచి ఫార్మా ట్రాక్‌ అనే ప్రైవేటు రంగ సంస్థ సేకరించిన అమ్మకాల సమాచారాన్ని తీసుకుంది. ఈ స‌మాచారాన్ని బోస్టన్‌ యూనివర్సిటీ, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి, తాజా నివేదికను వెలువ‌రించ‌డం విశేషం.

లాన్సెట్ జ‌న‌ర‌ల్ ప్ర‌కారం.. 2019లో పరిశోధకులు జరిపిన అధ్యయనంలో భారతీయుల యాంటీ బయాటిక్స్‌ వినియోగం తీవ్రస్థాయిలో ఉంద‌ని పేర్కొంది. వీటిలో అజిత్రోమైసిన్‌ అగ్రస్థానంలో ఉంద‌ని వెల్ల‌డించింది. చాలా దేశాల్లో వైద్యుల రాసిచ్చిన ప్రిస్కిప్ష‌న్ లేకుండా మందుల‌ను అమ్మ‌రు. అయితే భారత్‌లో మాత్రం మెడిక‌ల్ షాపుల్లో ఎవ‌రైనా మందులు కొనుగోలు చేయొచ్చ‌ని లాన్సెట్ అధ్య‌య‌నం పేర్కొంది. దీన్ని అరికట్టేందుకు కొత్త నిబంధనలను తీసుకురావడమే కాక, ఉన్న మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలయ్యేలా చూడాల‌ని నివేదిక‌లో వెల్ల‌డించింది.

అలాగే లాన్సెట్ త‌న అధ్య‌య‌నంలో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. 2019లో భార‌తీయులు వినియోగించిన యాంటీబయోటిక్ మందుల్లో 47 శాతం దేశ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లేనివేన‌ని తెలిపింది. అలాగే దేశంలో మందుల విక్ర‌యాల్లో 85 శాతం నుంచి 90 శాతం వాటా ప్రైవేటు రంగ యాంటీబయోటిక్స్‌ తయారీ సంస్థలదేన‌ని వెల్ల‌డించింది. దేశంలో ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ‌ ఆమోదం లేకుండా అమ్ముడవుతున్న మందుల్లో సెఫాలోస్పోరిన్స్‌, మాక్రోలైడ్స్‌, పెన్సిలిన్స్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయ‌ని లాన్సెట్ అధ్య‌య‌నం పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.