Begin typing your search above and press return to search.
5000 హెచ్ 1బీ దరఖాస్తుల్లో అవకతవకలు!
By: Tupaki Desk | 30 May 2018 11:51 AM GMT2014లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత లోకల్ సెంటిమెంట్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలంటూ ట్రంప్ `బయ్ అమెరికన్ హైర్ అమెరికన్` నినాదాన్ని అందుకున్నారు. దీంతో, అమెరికాలో పనిచేసేందుకు విదేశీయులకు మంజూరు చేసే హెచ్ 1బీ వీసాలపై అనేక ఆంక్షలు విధించడం, వాటి సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడం వంటి చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే హెచ్ 1బీ, హెచ్ 2బీ వీసాల దరఖాస్తుల్లో అవకతవకలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఒక ఈ మెయిల్ హెల్ప్ లైన్ ను ట్రంప్ ఏర్పాటు చేశారు. మే21 నాటికి 5000 దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నాయని ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్(ఎఫ్ డీ ఎన్ ఎస్) తెలిపింది.
యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) గుర్తించిన అనుమానాస్పద దరఖాస్తులను ఎఫ్ డీ ఎన్ ఎస్ పరిశీలించేందుకు సహకరిస్తుంది. ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వం 65000 హెచ్ 1బీ వీసాలను మంజూరు చేస్తుంది. అమెరికాలో ఉద్యోగం చేయాలని కలగనే విదేశీయుల కోసం 3 సంవత్సరాల కాలపరిమితితో ఈ వీసా మంజూరు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ వీసాను పొందేందుకు కొంతమంది అవకతవకలకు పాల్పడుతున్నారు. దీంతో, అమెరికాలో విదేశీయులకు సమాన అర్హతలున్న స్వదేశీయులు ఆ ఉద్యోగాలను కోల్పోతున్నారు. దీంతో, వీసా దరఖాస్తులలో అవకతవకలను గుర్తించేందుకు ట్రంప్ ఎఫ్ డీ ఎన్ ఎస్ సహకారంతో వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ఆ వీసాలలో అవకతవకలను ఆ మెయిల్ ఐడీకి పంపిన అనంతరం ఎఫ్ డీ ఎన్ ఎస్ విచారణ చేపడుతుంది. ఈ ఏడాది మే 21 నాటికి 5000 అనుమానాస్పద వీసా దరఖాస్తులు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది.