Begin typing your search above and press return to search.

క‌న్న‌డ‌లో గాలి రంగంలోకి దిగితే ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   1 May 2018 2:02 PM GMT
క‌న్న‌డ‌లో గాలి రంగంలోకి దిగితే ఇలా ఉంటుంది
X
గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి...ఈ పేరు గురించి తెలుగు రాష్ర్టాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక ఆయ‌న ఇలాకా అయిన క‌న్న‌డ నేల‌పై కూడా గాలి స‌త్తా గురించి సుప‌రిచిత‌మే. ఆయ‌న వ్యూమౄల‌ గురించి కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్ర‌తిప‌క్ష బీజేపీకి స్ప‌ష్ట‌త ఉంది. ఇక తాజా ఎన్నిక‌ల్లో గాలి హ‌వా సాగుతోంది. ఎంత‌లా అంటే..ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అయిన య‌డ్యుర‌ప్ప సైతం ఒకింత ఆలోచ‌న ప‌డేలా. ఎందుకంటే...గాలి ఇంటికి వ‌స్తున్న వారి సంఖ్య రోజుకు 4000-5000 వ‌ర‌కు ఉండ‌ట‌మే.

చిత్ర‌దుర్గ‌ జిల్లాలోని మొల‌క‌ల్మూరు స‌మీపంలో గ‌ల హ‌న‌గ‌ల్‌లోని ఓ రెండంత‌స్థుల భ‌వ‌నం ఇప్పుడు నిత్యం కిట‌కిట‌లాడుతోంది. ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేవారు, బీజేపీ సానుభూతిప‌రులు, పొరుగున ఉన్న బ‌ళ్లారి జిల్లాకు చెందిన వారితో ఆ నివాసం ర‌ద్దీగా ఉంటోంది. ఇంత జ‌న‌సందోహానికి కార‌ణం ఆ ఇంట్లో ఉండేది గాలి జనార్ద‌న్ రెడ్డి. వారంతా గాలిని క‌లిసేందుకు వ‌చ్చిన `అతిథులు`. ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించేందుకు వ‌స్తున్న వారు. మైనింగ్ కేసులో బ‌ళ్లారికి దూరంగా ఉండాల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వ‌డంతో ఆయ‌న ఇక్క‌డ ఉండి ఎన్నిక‌ల వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ఇదంతా త‌న ఆప్తుడైన శ్రీ‌రాములు గెలుపు కోసం చేస్తున్న‌ది అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అయితే ఆప్తుడి గెలుపుకోసం గాలి పెద్ద ఎత్తున కృషి చేయ‌డం, ఈ క్ర‌మంలో దానిపై ప‌లువురు నెగెటివ్‌గా స్పందిస్తున్న నేప‌థ్యంలో బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి య‌డ్యుర‌ప్ప స్పందించారు. రాజ‌కీయాల్లోకి గాలి తిరిగి ప్ర‌వేశించ‌డం వ‌ల్ల పార్టీపై ప‌లు వ‌ర్గాలు అసంతృప్తిగా ఉన్నాయ‌ని పేర్కొంటూ `కాస్త త‌గ్గండి` అని గాలికి సూచించిన‌ట్లు తెలుస్తోంది. దీనివెనుక గాలి ఇంటికి రోజుకు దాదాపుగా 4000-5000 మంది రావ‌డం..అక్క‌డ పెద్ద ఎత్తున సంద‌డి నెల‌కొన‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా...మధ్య కర్ణాటక జిల్లాల్లో బీజేపీ ప్రచారాన్ని గాలి జనార్దన్‌ రెడ్డే చూసుకుంటున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ చెబుతున్నది. అయితే అవినీతిపై పోరాటం అంటూనే బీజేపీ.. ఆయనతో ప్రచారం చేయించడాన్ని కాంగ్రెస్ తమ ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి చెందిన ఏడుగురికి ఎలా టికెట్లు ఇచ్చారంటూ సొంత పార్టీ కార్యకర్తలే నిలదీయడం బీజేపీని ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర శ్రేయస్సు కోసం తాను గాలి సోదరులను క్షమించేశానని ఆ పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప అనడం బీజేపీని మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది.