Begin typing your search above and press return to search.

ఒకే చెట్టుకు 51 ర‌కాల మామిడి పండ్లు..

By:  Tupaki Desk   |   5 Jun 2018 11:30 PM GMT
ఒకే చెట్టుకు 51 ర‌కాల మామిడి పండ్లు..
X
విద‌ర్భ‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ర‌వి మ‌ర్షేత్వ‌ర్ వృత్తి రీత్యా సివిల్ ఇంజ‌నీర్....గ‌ల్ఫ్ లో ఉద్యోగం....ల‌క్ష‌ల్లో జీతం....విలాస‌వంత‌మైన జీవితం....అయితే, ఇవేవీ ర‌వికి తృప్తినివ్వ‌లేదు. త‌న ప్రాంతంలోని రైతుల ఆత్మ‌హ‌త్య‌లు అత‌డిని క‌ల‌చివేశాయి. చీక‌టిలో మ‌గ్గిపోతూ అర్ధాంత‌రంగా ముగిసిపోతోన్న రైతుల జీవితాల్లో అత‌డు వెలుగులు నింపాల‌ని చూశాడు. అందుకోసం, తాను చేస్తున్న వృత్తిని తృణ‌ప్రాయంగా వ‌దిలేశాడు. త‌న ప్రాంత రైతుల కోసం రైతు బిడ్డ‌గా మారాడు. వ్య‌వ‌సాయానికి సంబంధించిన ప‌థ‌కాలు, మెల‌కువ‌లపై రైతుల‌కు అవ‌గాహన క‌ల్పించాల‌ని సంక‌ల్పించాడు. దేశ‌వ్యాప్తంగా వ్య‌వ‌సాయంలో అవ‌లంబిస్తోన్న వినూత్న ప‌ద్ధ‌తుల‌ను తెలుసుకునేందుకు విద‌ర్భ రైతుల‌తో క‌లిసి దేశ‌వ్యాప్తంగా 500 ప్రాంతాల్లో ప‌ర్య‌టించాడు. నేడు ఎంద‌రో రైతుల జీవితాల్లో వెలుగులు నింపి...ఎంతో మందికి ఆద‌ర్శ‌ప్రాయుడ‌య్యాడు. రైతుల‌కు చెప్ప‌డ‌మే కాకుండా తాను కూడా రైతుగా మారి....ఒక మామిడి చెట్టు మీద 51 ర‌కాల మామిడి కాయ‌ల‌ను పండించి ఔరా అనిపించాడు.

విద‌ర్భలోని వ‌షీమ్ గ్రామానికి చెందిన ర‌వి తండ్రి సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వ్య‌వ‌సాయం స‌హా అనేక రంగాల్లోని వ్య‌క్తుల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించారు. ఆయ‌న నుంచి స్ఫూర్తి పొందిన రవి త‌న తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నాడు. త‌న ఉద్యోగాన్ని వ‌దిలేసిన త‌ర్వాత రైతుల‌పై దృష్టి పెట్టాడు. రైతుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, స‌బ్సిడీల ప‌ట్ల అవ‌గాహ‌న లేక చాలా న‌ష్ట‌పోతున్నార‌ని గ్ర‌హించాడు. స్థానిక భాష‌లో వారికి ఆ స‌మాచారం అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ ఇబ్బంది ఏర్ప‌డింద‌ని గుర్తించాడు. అందుకు వారంద‌రికీ వాటిపై అవ‌గాహ‌న క‌ల్పించడం మొద‌లుపెట్టాడు. దాంతోపాటు దేశంలో విజ‌య‌వంతంగా వ్య‌వసాయం చేస్తోన్న అనేక‌మంది రైతుల‌ను క‌లిసి వారి నుంచి మెళ‌కువ‌లు నేర్చుకున్నాడు. వాటిని త‌మ ప్రాంత రైతుల‌కు వివ‌రించాడు. ఈ క్ర‌మంలోనే సేంద్రీయ వ్య‌వ‌సాయంపై ప‌రిశోధ‌న‌ల‌కుగాను ప‌ద్మశ్రీ అవార్డ్ పొందిన సుభాష్ పాలేక‌ర్ ను క‌లిశాడు. అంటుక‌ట్టే విధానాన్ని ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకొని త‌న సొంత పొలంలో ప్ర‌యోగించ‌డంతో పాటు రైతుల‌కు నేర్పించాడు. సేంద్రీయ వ్య‌వ‌సాయం, అంటుక‌ట్ట‌డం ద్వారా అధిక‌దిగుబ‌డితో పాటు నాణ్య‌మైన పంట‌ను సాధించాడు. త‌నకున్న 5 ఎక‌రాల పొలంలో 2.5ఎక‌రాల్లో మామిడితోట‌ను సాగుచేసి దాదాపు 1000 పండ్ల దిగుబ‌డి సాధించాడు. త‌ర‌త‌రాల నుంచి త‌మ కుటుంబానికి వార‌స‌త్వ సంప‌ద‌గా వ‌స్తోన్న ఓ మామిడి చెట్టుకు అంటుక‌ట్ట‌డం ద్వారా 51 ర‌కాల మామిడి కాయ‌ల‌ను పండించి ప్ర‌శంస‌లందుకున్నాడు. ల‌క్ష‌ల జీతాన్ని వ‌దులుకొని ల‌క్ష్యం కోసం ప‌నిచేస్తోన్న ర‌వి ఎంద‌రికో ఆద‌ర్శ‌నీయుడు.