Begin typing your search above and press return to search.

ఫ్లోరిడాను ఖాళీ చేసేలా ఇర్మా ఏం చేసింది?

By:  Tupaki Desk   |   10 Sep 2017 5:55 AM GMT
ఫ్లోరిడాను ఖాళీ చేసేలా ఇర్మా ఏం చేసింది?
X
చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా ల‌క్ష‌లాది మంది అమెరిక‌న్లు త‌మ ప్రాంతాల్ని వ‌దిలేసి.. సుర‌క్షిత ప్రాంతాల‌కు ప‌య‌న‌మ‌వుతున్న సిత్ర‌మైన దృశ్యం ఇప్పుడు ఫ్లోరిడాతో పాటు.. ఇర్మా ప్ర‌భావితం అవుతుంద‌న్న అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో క‌నిపిస్తుంది. ప్ర‌పంచానికి పెద్ద‌న్న అయిన అమెరికా.. ఒక హ‌రికేన్‌కు ఎందుకంతగా వ‌ణికిపోతుంది? అన్న‌ది చూస్తే.. ఇర్మా ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఈ రోజు (భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం) ఇర్మా అమెరికా తీరాన్నితాకనుంది. ఇప్ప‌టివ‌ర‌కూ తాను తాకిన అన్ని దేశాల‌కు అపార‌మైన న‌ష్టాన్ని వాటిల్లేలా చేసి ఇర్మా ఇవాళ అమెరికాను ట‌చ్ చేయ‌నుంది. దీని ప్ర‌భావంతో ఫ్లోరిడా ప్రాంతం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హ‌రికేన్ తీరాన్ని ట‌చ్ చేసే స‌మ‌యంలో గంట‌కు 205 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని చెబుతున్నారు. ఇక‌.. అల‌లు అయితే ఏకంగా 12 అడుగుల ఎత్తులో ఎగిసిప‌డ‌తాయ‌న్న అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం కేట‌గిరి 3లో ఉన్న ఇర్మా దెబ్బ‌కు ఒక్క ఫ్లోరిడా మ‌హాన‌గ‌రంలో ల‌క్ష‌లాది మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లారు.

ఇర్మా ప్ర‌భావంతో భ‌యానికి గురైన వారే కాదు.. హ‌రికేన్ ట‌చ్ చేసే స‌మ‌యానికి ఎవ‌రూ ఉండొద్ద‌న్న సూచ‌న‌ను అధికారులు చేస్తున్నారు. ఒక‌వేళ తాము చెప్పిన‌ట్లుగా సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్ల‌ని వారు.. త‌మ నుంచి ఎలాంటి సాయాన్ని పొందాల‌ని ఆశించొద్ద‌ని అధికారులు స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. . ఇర్మా ట‌చ్ చేసిన క‌రేబియ‌న్ దీవుల్లోని ప‌లు దేశాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. బ‌హ‌మాస్‌.. క్యూబా ల్లోనూ ఇర్మా తన త‌డ‌ఖా ప్ర‌ద‌ర్శించి తీవ్రంగా న‌ష్ట‌పోయేలా చేసింది. ప్రాణ‌న‌ష్టంతో పాటు.. కోలుకోలేనంత ఆస్తిన‌ష్టాన్ని క‌లిగించ‌టం గ‌మ‌నార్హం.

అమెరికా చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒక‌ప్ర‌కృతి వైప‌రీత్యం నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌తగా రికార్డు స్థాయిలో లక్ష‌లాది మందిని సుర‌క్షిత స్థానాల‌కు త‌ర‌లించింది. అనే ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ఫ్లోరిడా కీస్ లో తీరాన్ని తాకి.. అనంత‌రం ప్ర‌ధాన భూభాగ‌మైన మ‌యామి- డేడ్ కౌంటీపై ఇర్మా విరుచుకుప‌డ‌నుంది.

ఫ్లోరిడా తీరాన్ని ఇర్మా ట‌చ్ చేసే స‌మ‌యంలో కుండ‌పోత వ‌ర్షంతో పాటు.. భారీ ఎత్తున గాలులు వీస్తాయ‌ని అంచ‌నా వేస‌త్ఉన్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని మొత్తం జ‌నాభాలో నాలుగోవంతు జ‌నాభా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్ల‌టం చూస్తే.. ఈహ‌రికేన్ తీవ్రత ఎంత‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది. అయితే.. ఫ్లోరిడాలోని భార‌తీయులు మాత్రం త‌మ నివాసాల్ని వ‌దిలివెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో.. త‌మ హోట‌ళ్ల‌లో బాధితుల‌కు ఆశ్ర‌యాన్ని క‌ల్పించ‌టం గ‌మ‌నార్హం.

జార్జియా రాష్ట్రంలోని అతి పెద్ద న‌గ‌ర‌మైన అట్లాంటాలోని హోట‌ళ్లు అన్నీ ఫ్లోరిడా ప్ర‌జల‌తో నిండిపోయాయి. ఫ్లోరిడా.. జార్జియాల‌తో పాటు ఉత్త‌ర కరొలినా.. ద‌క్షిణ క‌రొలినా.. అల‌బామా రాష్ట్రాల్లోనూ వాతావ‌ర‌ణ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు. విప‌త్తు సాయంలో పాలుపంచుకునేందుకు వీలుగా అమెరికా అధ్య‌క్షుడు ఇప్ప‌టికే నిధులు విడుద‌ల చేయ‌గా.. తాజాగా మ‌రో 1525 కోట్ల డాల‌ర్ల‌ను మంజూరు చేశారు.

ఇర్మా భ‌యంతో ల‌క్ష‌లాది మందిని ఫ్లోరిడా నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. భారీగా వెళుతున్న బాధితుల కార‌ణంగా ర‌హ‌దారులు కిక్కిరిసిపోవ‌టంతో పాటు.. ట్రాఫిక్ జాంలు అవుతున్నాయి. యూఎస్ జాతీయ హరికేన్‌ కేంద్రం సమాచారం ప్రకారం.. గ‌డిచిన‌ 82 ఏళ్లలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడ్డ అతి తీవ్రమైన ఐదు హరికేన్లలో ఇర్మా ఒకటిగా చెబుతున్నారు. క‌రేబియ‌ణ్ దీవుల్ని తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచిన ఇర్మా.. శ‌నివారం క్యూబాను తాకి ఆ దేశానికి తీర‌ని న‌ష్టాన్ని క‌లుగ‌జేసింది.

గంట‌కు 200 కిలోమీట‌ర్ల వేగంతో వీసిన గాలుల కార‌ణంగా భారీ న‌ష్టం వాటిల్లేలా చేస్తున్నాయి. ఇర్మా హ‌రికేన్ నేప‌థ్యంలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్న‌ట్లుగా భార‌త విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. అమెరికా.. వెనెజులా.. ఫ్రాన్స్‌.. నెద‌ర్లాండ్స్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఇర్మా సాయం కోసం హాట్‌లైన్‌ నెంబరు: 202-258-8819ను సిద్ధం చేశారు. ఇక‌.. అత్యవసర వీసా కోసం వినతులు పంపాల్సిన వెబ్ సైట్ ‌గా visa.washington@mea.gov.in ను ప్ర‌క‌టించారు.