Begin typing your search above and press return to search.

562 రోడ్లు మంచు వ‌ల్ల మూత‌ప‌డ్డాయి

By:  Tupaki Desk   |   9 Jan 2017 1:53 PM GMT
562 రోడ్లు మంచు వ‌ల్ల మూత‌ప‌డ్డాయి
X
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు హిమాచల్‌ప్రదేశ్‌లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. సిమ్లాతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో 562 రోడ్లు మూసివేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. వీధుల్లో ఎక్కడికక్కడ పేరుకుపోయిన మంచును యంత్రాల సాయంతో తొలగించి ఇప్పటివరకు 208 రోడ్లను తిరిగి ప్రారంభించామని తెలిపారు. మంచు కప్పుకుపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

కాగా.. జమ్ము-శ్రీనగర్ హైవేలో అటవీ ప్రాంతం మధ్యలో గత మూడురోజులుగా 800 ట్రక్కులు, 200 కార్లు నిలిచిపోయాయి. కశ్మీర్ లోయకు ఈ రహదారి ఒక్కటే మార్గం కావడంతో ఇది మూసుకుపోతే నిత్యావసర సరుకుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. మార్గమధ్యంలో ఇరుక్కుపోయిన ట్రక్ డ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రహదారి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, స్తంభించిపోయిన వాహనాలను పంపే ఏర్పాట్లు చేస్తామని ఇక్కడి అధికారులు తెలిపారు. "రహదారిపై ఇరుక్కుపోయిన ట్రక్కు డ్రైవర్లకు నీటి కొరతే తీవ్ర సమస్యగా మారింది. దగ్గర్లో ఉన్న ప్రాంతానికి నేను నీరు తెచ్చుకోవడానికి వెళ్లాను. ఒక వ్యక్తి దగ్గర ట్యాంకు నిండా నీరు ఉన్నా అతను ఇవ్వలేదు. బకెట్ నీటిని నేను బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది" అని రియాజ్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/