Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యం ఆగమాగం.. రోజులో 5.8లక్షల కొత్త కేసులు

By:  Tupaki Desk   |   1 Jan 2022 11:30 AM GMT
అగ్రరాజ్యం ఆగమాగం.. రోజులో 5.8లక్షల కొత్త కేసులు
X
గత ఏడాది మే నెలలో భారత్ ను కరోనా సెకండ్ వేవ్ కమ్మేసిన వైనం తెలిసిందే. ఆ సందర్భంగా రోజు వ్యవధిలో నాలుగు లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో.. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి. భారీగా పెరిగిన కేసులతో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరి కావటం.. వైద్య సాయం కోసం అంబులెన్సులతో ఆసుపత్రుల బయట బారులు తీరటం.. ఆక్సిజన్ కొరతతో ఎంతటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారో అందరికి తెలిసిందే.
134 కోట్ల జనాభా ఉన్న దేశంలో రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదు అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో దేశ ప్రజలంతా చూసిందే. అలాంటిది 35 కోట్ల కంటే తక్కువ జనాభా ఉన్న అమెరికా లాంటి దేశంలో రోజుకు 5.8 లక్షల కొత్త కేసులు నమోదు కావటమంటే.. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఊహించని రీతిలో వ్యాపిస్తున్న వైరస్ వ్యాప్తికి అమెరికా అతలాకుతలమవుతోంది.

వారం వ్యవధిలో అమెరికాలో రోజుకు 2.9లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావటం మొదలైంది. దేశంలో రోజుకు 10,200 మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. బాధితుల్లో పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఊరట కలగించే అంశం. డెల్టాతో పోలిస్తే ఇప్పుడు తీవ్రత తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో కేసులు వస్తున్నాయి.

రాజధాని వాషింగ్టన్ డీసీ.. మేరీల్యాండ్.. ఒహియో తదితర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో 27 శాతం ఆడ్మిషన్లు పెరిగాయి. ఇప్పటికి యువతలో టీకాలు తీసుకోని వారు ఉండటంతో.. రానున్న వారాల్లో వైరస్ మంచు తుఫాను మాదిరి విరుచుకుపడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత భారీగా కేసులు నమోదు కావటంతో ఆసుపత్రుల్లో సేవలు అందించే తీరుపై ప్రభావంతో పడుతుందని.. దీనికి తగ్గట్లు ప్రజలు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే కరోనా వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేసిన ఆస్ట్రేలియా సైతం ఒమిక్రాన్ విషయంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. కొద్ది రోజుల క్రితమే తొలిసారి పాజిటివ్ కేసు నమోదు కాగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే పది వేల కేసులకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజులోనే 32 వేల కేసులు నమోదు కావటం గమనార్హం. రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువ కావటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆస్ట్రేలియాలో నెలకొంది.