Begin typing your search above and press return to search.

5జీ వస్తే దేశ ప్రజల జేబుల్లో నుంచి రూ.6లక్షల కోట్లు ఖల్లాస్

By:  Tupaki Desk   |   8 Nov 2019 1:30 AM GMT
5జీ వస్తే దేశ ప్రజల జేబుల్లో నుంచి రూ.6లక్షల కోట్లు ఖల్లాస్
X
కాలం చాలా వేగంగా మారిపోతోంది. ఎంత స్పీడ్ అంటే.. గుర్తు తెచ్చుకుంటే అవాక్కు అయ్యేంతగా. ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి సెల్ ఫోన్ కు మారటానికి పట్టిన సమయం ఎంతో తెలిసిందే. సెల్ ఫోన్ వచ్చాక 2జీ.. 3జీ.. 4జీ అంటూ ఎంత త్వరగా అప్ గ్రేడ్ అయ్యామో తెలిసిందే.

మారే టెక్నాలజీకి అనుగుణంగా చేతిలో ఉండే ఫోన్లను అనివార్యంగా మార్చేస్తున్నాం. మనకు తెలీకుండానే వేలాది రూపాయిలు ఒక్కొక్కరు ఫోన్ల కోసం ఖర్చు చేస్తున్న పరిస్థితి. బేసిక్ ఫోన్ల నుంచి 4జీ వచ్చే వరకూ అమ్మిన ఫోన్ల లెక్క తెలిస్తే షాక్ తినాల్సిందే. దేశ జనాభా 130 కోట్లు అయితే.. అమ్ముడైన ఫోన్లు ఏకంగా 530 మిలియన్ ఫోన్లు. ఇక.. వాటి విలువ తెలిస్తే మరోమారు నోట మాట రాదంతే.

ఎందుకంటే.. ఆ విలువ అంత భారీగా ఉంటుంది మరి. 2012లో భారత్ లో తొలి 4జీ స్మార్ట్ ఫోన్ వచ్చింది. అంటే.. ఏడేళ్ల వ్యవధిలో స్మార్ట్ ఫోన్ల కంపెనీల వాల్లు 53 కోట్ల ఫోన్లను అమ్మేశారు. ఏ జీ అన్నది పక్కన పెడితే ఇప్పటివరకూ అమ్మిన స్మార్ట్ ఫోన్ల విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.6లక్షల కోట్లు.

మన పొరుగున ఉన్న చైనాతో సహా.. పలు దేశాల్లో ఇప్పటికే 5జీ వచ్చేసింది. అయితే.. మనమింకా 4జీకే కుదురుకోలేదు. ఏడాది లోపే 5జీ వచ్చేసే పరిస్థితి. అదే జరిగితే.. ఇప్పడు వాడుతున్న మన స్మార్ట్ ఫోన్లు పనికి రావు. మళ్లీ ఫోన్లను కొనాల్సి ఉంటుంది. అలా అని ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడే వారంతా 5జీ ఫోన్లు కొనేస్తారని చెప్పలేం కానీ.. 5జీ వచ్చేసిన మూడేళ్ల వ్యవధిలో తక్కువలో తక్కువ రూ.6లక్షల కోట్ల మేర కొత్త ఫోన్లు కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు.

మొత్తంగా చూస్తే స్మార్ట్ ఫోన్ల కంపెనీల పంట పండినట్లే. అదే వేళ.. దేశ ప్రజల జేబుల్లో నుంచి అన్నేసి లక్షల కోట్లు మొబైల్ ఫోన్ల కోసం ఖర్చు పెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పకతప్పదు. 4జీ ఫోన్ల విషయానికి వస్తే శాంసంగ్ వాటా 28.2 శాతమైతే.. షావోమీ 20.7 శాతం.. వివో 11.3 శాతం మార్కెట్ షేర్ ఉంది. ఒప్పో 7.8 శాతం.. లెనోవో+మోటొరోలా 6.2 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. 4జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అమ్ముడైన ప్రతి నాలుగు ఫోన్లలో మూడు ఫోన్లు ఈ కంపెనీలకు చెందినవే కావటం విశేషం. 5జీ ఫోన్ల విషయానికి వస్తే.. ధర చాలా కీలకం కానుంది. మరీ.. మార్పును ఏ కంపెనీ అందిపుచ్చుకుంటుందో చూడాలి.