Begin typing your search above and press return to search.

'5జీ' మహా వేలానికి ఓకే.. కేంద్రానికి కాసుల పంట

By:  Tupaki Desk   |   16 Jun 2022 4:35 AM GMT
5జీ మహా వేలానికి ఓకే.. కేంద్రానికి కాసుల పంట
X
అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు. ఫోన్ అంటే మాట్లాడటానికే అన్న దానిని మార్చేసిన ఘనత 4జీదే. మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండే 4జీకి పది రెట్లు ఇంటర్నెట్ వేగంతో ఉండే 5జీ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా? అన్న ఆసక్తి అందరిలోనూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్పెక్ట్రామ్ వేలానికి కేంద్రం ఓకే చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కమిటీ.. 5జీ స్పెక్ట్రామ్ కు సంబంధించిన వేలంపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే నెల 26న 5జీ స్పెక్ట్రామ్ వేలాన్ని షురూ చేయనుంది.

దాదాపు రూ.4.31 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెట్జ్ ల స్పెక్ట్రామ్ ను టెలికం కంపెనీలకు 20 ఏళ్ల కాలానికి అప్పజెప్పనున్నారు. ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్.. రిలయన్స్ జియో.. వొడాఫోన్ ఐడియాలకు మొత్తం9 ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ స్పెక్ట్రాన్ని వేలం వేయనున్నారు. దీంతో పాటు పెద్ద టెక్నాలజీ సంస్థల సొంత అవసరాల కోసం కూడా ప్రైవేటు 5జీ నెట్ వర్కు ఏర్పాటు చేసుకోవటానికి వీలుగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ వేలంలో స్పెక్ట్రామ్ ను దక్కించుకునే టెలికాం కంపెనీలు ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ 5జీ సేవల్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక్కసారి 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినంతనే డిజిటల్ రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. మరింత మెరుగైన.. నాణ్యమైన డేటా వినియోగానికి వీలుగా 5జీ సేవలు ఉండనున్నాయి.

5జీ స్పెక్ట్రామ్ వేలానికి కేంద్రం ఓకే చేసిన నేపథ్యంలో టెలికం శాఖ అంచనాల ప్రకారం తొలుత దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. ఆర్థిక రాజధాని ముంబయి.. చెన్నై.. కోల్ కతా.. హైదరాబాద్.. బెంగళూరుతో సహా మొత్తం 13 నగరాల్లో 5జీ సేవలు మొదలు కానున్నాయి. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించే వీలుంది.

5జీ స్పెక్ట్రామ్ వేలం నేపథ్యంలో కేంద్రానికి కాసుల వర్షాన్ని కురిపించనుంది. అయితే.. స్పెక్ట్రామ్ దక్కించుకున్న కంపెనీలు తాము చెల్లించాల్సిన మొత్తాల్ని ఒకేసారి చెల్లించకుండా.. రుసుమును 20 ఏళ్లు వాయిదాల రూపంలో చెల్లించే వెసులుబాటు ఇవ్వటం భారీ ఊరటగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. తమకు స్పెక్ట్రామ్ అవసరం లేదనుకుంటే 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి తిరిగి అప్పగించేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. కేంద్రానికి స్థిర పద్దతిలో ఆదాయం లభించనుంది.

5జీ స్పెక్ట్రం వేలం తీరును చూస్తే ఇటు కేంద్రానికి.. అటు టెలికం కంపెనీలకు లాభసాటిగా మారేలా ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ధరల విషయంలో టెలికం కంపెనీలు ఆశించిన మేరకు లేవన్న మాట వినిపిస్తోంది. 2018లో జరిగిన స్పెక్ట్రం వేలంతో పోలిస్తే 5జీ స్పెక్ట్రం రిజర్వు ధరను ట్రాయ్ 39 శాతం తగ్గించింది. అయితే.. దీన్ని 90 శాతం తగ్గించాలని టెలికం కంపెనీలు కోరాయి. అందుకు భిన్నంగా కేంద్రం మాత్రం తనకున్న లెక్కల్ని అనుసరించి ధరల్ని ఫిక్సు చేసినట్లుగా చెబుతున్నారు.