Begin typing your search above and press return to search.

ఈ నెలాఖరుకు 5జీ రెఢీ.. సంతోషం సరే.. ఈ లెక్క విన్నారా?

By:  Tupaki Desk   |   10 Aug 2022 4:24 AM GMT
ఈ నెలాఖరుకు 5జీ రెఢీ.. సంతోషం సరే.. ఈ లెక్క విన్నారా?
X
గడిచిన కొంతకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేస్తోంది. దేశీయంగా టెలికం దిగ్గజ సంస్థలైన రిలయన్స్ జియో.. భారతి ఎయిర్ టెల్ రెండు సంస్థలు 5జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయటం తెలిసిందే. వీరితో పాటు ఐడియా వొడాఫోన్ తో పాటు.. అదానీ సంస్థ కూడా కొనుగోలు చేసింది. తాము దక్కించుకున్న 5జీ స్పెక్ట్రమ్‌ను వినియోగదారులకు సేవల రూపంలో అందించేందుకు జియో.. ఎయిర్ టెల్ వడివడిగా అడుగులు వేస్తోంది.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరు అంటే.. ఆగస్టు చివరికి 5జీ సేవలు పరిమిత స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. 5000 పట్టణాల్లో ఎయిర్ టెల్ ఈ నెలాఖరు నాటికి 5జీ సేవలు అందించేలా కసరత్తు చేస్తుంటే.. జియో మాత్రం ఇదే సమయానికి వెయ్యి ప్రధాన నగరాలు.. పట్టణాల్లో తన నూతన సాంకేతికతను అందజేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికల్ని సిద్ధం చేయటంతో పాటు.. అందుకు అవసరమైన అన్ని పరీక్షల్ని పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.

5జీ నెట్ వర్కును అందించటానికి వీలుగా దేశీయంగా డెవలప్ చేసిన టెలికం గేర్స్ ను జియో వాడుతుంటే.. ఎయిర్ టెల్ సైతం అంతే దూకుడుగా పనిని పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది.

తమ సంస్థ చరిత్రలోనే అతి పెద్ద రోల్ అవుట్ ఒకటిగా ఎయిర్ టెల్ అభివర్ణిస్తోంది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్న వేళ.. వినియోగదారులకు అతి ముఖ్యమైన టారిఫ్ విషయంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎయిర్ టెల్ వరకు వస్తే ఒక్కో యూజర్ నుంచి కంపెనీకి రూ.183 వరకు ఆదాయం వస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్ లో మొబైల్ సేవల ఛార్జీలు చాలా తక్కువన్న సంగతి తెలిసిందే. అయితే.. 5జీ కోసం భారీగా ఖర్చుచేసిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వెనక్కి తీసుకునేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పుడు వస్తున్న రూ.183ను వీలైనంత త్వరగా రూ200 చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరికొద్ది నెలల్లోనే దీన్ని రూ.300 వరకు తీసుకెళతారని చెబుతున్నారు. అంటే.. ఊరించే 5జీ ఏమీ ఉచితంగా రాకపోగా.. జేబుకు భారాన్ని పెంచుతుందన్న అంశంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఆ దిశగా టెలికం కంపెనీలు అడుగులు వేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.