Begin typing your search above and press return to search.

రెండురోజుల‌వుతున్నా..దొర‌క‌ని విద్యార్థుల జాడ‌లు

By:  Tupaki Desk   |   16 July 2018 5:32 AM GMT
రెండురోజుల‌వుతున్నా..దొర‌క‌ని విద్యార్థుల జాడ‌లు
X
తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో పడవ ప్రమాదం జరిగి రోజున్నర గడిచినా గల్లంతైన విద్యార్థుల ఆచూకి దొర‌క‌డం లేదు. గౌతమి నదీ పాయలో శనివారం సంభవించిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు విద్యార్థులు - ఓ వివాహిత కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ఈ దుర్ఘటనతో గోదావరి మధ్య దీవిలో ఉన్న సలాదివారిపాలెం - వలసలతిప్ప - పొట్టితిప్ప - శేరులంక - సీతారామపురం - కొత్తలంక గ్రామాల్లో విషాదం అలుముకుంది. పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. శనివారం రాత్రి భారీ వర్షం - వరద ఉదృతి కారణంగా నిలిపేసిన గాలింపును తిరిగి ఆదివారం ఉదయం ఆరుగంటలకే మొదలెట్టారు. ఓ వైపు గోదావరి వరద ఉదృతి పెరిగింది. మరోవైపు విడవకుండా వర్షం కురుస్తూనే ఉన్న‌ప్పటికీ సాగిన గాలింపు తగిన ఫలితాల్ని మాత్రం ఇవ్వలేక పోయింది. యంత్రానికి సమీపంలోని కొమరగిరి గ్రామం వద్ద గోదావరిలో ఒక మహిళ మృతదేహాన్ని గాలింపు బృందాలు కనుగొన్నాయి. ఆమె పడవ ప్రమాదంలో గల్లంతైన దుర్గగా గుర్తించారు. కాగా విద్యార్ధినిల జాడ మాత్రం కానరాలేదు. ఒక విద్యార్ధినికి చెందిన స్కూల్‌ బ్యాగ్‌ తీరానికి కొట్టుకొచ్చింది

పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు - ఇతరులు వివిధ పనుల కోసం మురమళ్ల వచ్చి తిరిగి ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల్లంక ఒడ్డు నుంచి సలాదివారిపాలెం గ్రామానికి బయలుదేరిన పడవ.. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న వంతెన స్తంభాన్ని ఢీకొని ఒరిగిపోయింది. దీంతో కొంతమంది వంతెన పునాదిపైకి దూకి ప్రాణాలు కాపాడుకోగా మరికొంత మంది నీటిలో మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలోని వంతెన నిర్మాణ కార్మికులు మరో పడవలో వెళ్లి కొందరిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు గల్లంతయ్యారు. కొంతమంది విద్యార్థులు పాఠశాల బ్యాగులు వెనుక తగిలించుకోవడంతో వాటి ఆధారంగా వారిని రక్షించగలిగారు. రెండో శనివారం అయినప్పటికీ.. సెలవు రద్దు చేసి.. 'వనం-మనం' కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశాలు ఇవ్వడం ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. పిల్లల మృతదేహాల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడసారి చూపుల కోసం గుండలవిసేలా రోదిస్తున్న బాధితుల తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన మహిళ మృతదేహం కొమరగిరి వద్ద లభ్యమ‌వ‌గా ఆమెను నాగమణిగా గుర్తించారు. ఆరుగురు పాఠశాల విద్యార్థుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ఘటనలో గల్లంతైన వారంతా మృతి చెందారని అధికారులు నిర్థారించారు

25అత్యాధునిక పడవలు - ఎన్‌ డిఆర్‌ ఎఫ్‌ - ఎస్‌ టిఆర్‌ ఎఫ్‌ బృందాలు గోదావరిలో వేర్వేరుగా ఈ గాలింపు చర్యలు నిర్వహించాయి. వీరికి స్థానిక మత్స్యకారులు - గజఈతగాళ్ళు సహకరిస్తున్నారు. సాయంత్రం కలెక్టర్‌ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో ఆరుగురు విద్యార్ధినిలు - ఒక మహిళ గల్లంతైనట్లు నిర్ధారించారు. వర్షాలు కారణంగా గాలింపునకు వాతా వరణం సహకరించడంలేదన్నారు. ఈ ఏడుగురు కాకుండా మరెవరైనా గల్లంతయ్యారా అన్న విషయంపై పరిసర గ్రామాలకు బృందాల్ని పంపించి వాకబు చేస్తున్నామన్నారు గోదావరికి వడి ఎక్కువగా ఉందన్నారు. గోదావరి సముద్రంలో కలిసే నది ముఖ ప్రాంతంలో గాలించాల్సి వ‌స్తోందన్నారు. ఇక్కడ తీర రక్షణ దళాలు అత్యాధునిక సాంకేతిక పరికరాల్తో గాలింపు నిర్వహిస్తున్నారన్నారు. సహజంగా ఈ ప్రాంతంలో గోదావరిలో ఎవరైన మునిగితే సత్తెమ్మతల్లి చెట్టు ప్రాంతంలో తేలుతుంటారు. దీన్ని దృష్టి లో పెట్టుకుని ఆ ప్రాంతానికి కలెక్టర్‌ - ఎస్‌ పి - అమలాపురం డిఎస్‌ పి - మూడో బెటాలియన్‌ కమాండెంట్‌ లు మరపడవల్లో వెళ్ళి పరిశీలించారు. సాయంత్రం 7గంటల వరకు గాలింపు కొనసాగింది. తిరిగి సోమవారం ఉదయాన్నే గాలింపు మొద‌లుపెట్టారు. పాఠశాలకు వెళ్లి వస్తామని చెప్పిన తమ పిల్లలు తిరిగిరాకపోవడాన్ని ఆ కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి. పడవ ప్రమాదం వార్త తెలిసినప్పటి నుంచి ఆ ఆరుగురు విద్యార్థినుల తల్లిదండ్రులు గోదావరి ఒడ్డునే ఉండి తమవారి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.