Begin typing your search above and press return to search.

షా మాట - చంద్ర‌బాబు గురువారం ప్ర‌ధాని!

By:  Tupaki Desk   |   10 Feb 2019 7:28 AM GMT
షా మాట - చంద్ర‌బాబు గురువారం ప్ర‌ధాని!
X
కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో విప‌క్షాల‌న్నీ ఒక్క‌ట‌వుతున్నాయి. మ‌హా కూట‌మిని ఏర్పాటు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, డీఎంకే అధ్య‌క్షుడు ఎం.కె.స్టాలిన్‌ స‌హా ప‌లువురు నేత‌లు కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, బీఎస్పీ అధ్య‌క్షురాలు మాయావ‌తి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాద‌వ్ కాంగ్రెస్ సారథ్యానికి ప్ర‌స్తుతానికి ఓటెయ్య‌లేదుగానీ వారూ బీజేపీ వ్య‌తిరేకులే. ఎన్డీయేను అధికార పీఠానికి దూరం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌వారే.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ విప‌క్ష కూట‌మిపై బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా విమ‌ర్శ‌ల దాడి పెంచారు. విప‌క్షం అధికారంలోకి వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్తూ చుర‌క‌లంటించారు. గోవాలో అట‌ల్ బూత్ కార్య‌క‌ర్త‌ల స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి షా తాజాగా ప్ర‌సంగించారు. విప‌క్ష కూట‌మి వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తే వారంలో రోజుకొక నేత ప్ర‌ధాన‌మంత్రిగా ఉంటార‌ని షా ఎద్దేవా చేశారు.

సోమ‌వారం రోజు మాయావ‌తి, మంగ‌ళ‌వారం నాడు అఖిలేశ్ యాద‌వ్, బుధ‌వారం హెచ్‌.డి.దేవెగౌడ‌, గురువారం చంద్ర‌బాబు నాయుడు, శుక్ర‌వారం ఎం.కె.స్టాలిన్‌, శ‌నివారం శ‌ర‌ద్ ప‌వార్ దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ఉంటార‌ని షా పేర్కొన్నారు. ఆదివారం రోజు సెల‌వు దిన‌మ‌ని.. ఆ రోజు ప్ర‌ధాని ఉండ‌ర‌ని ఎద్దేవా చేశారు.

దేశానికి అలాంటి దౌర్భాగ్య స్థితి త‌లెత్త‌కుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ స్ప‌ష్ట‌మైన మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. మోదీని మ‌ళ్లీ ప్ర‌ధాని పీఠ‌మెక్కించాల‌ని కోరారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వ‌స్తే క‌శ్మీర్ నుంచి కోల్ క‌తా వ‌ర‌కు దేశంలో ఎక్క‌డా చొర‌బాట్లు చోటుచేసుకోకుండా అడ్డుకుంటామ‌ని చెప్పారు. అసోంలో తాము చేప‌ట్టిన నేష‌న‌ల్ రిజిస్ట‌ర్ ఆఫ్ సిటిజ‌న్స్(ఎన్ ఆర్ సీ) న‌మోదు ప్ర‌క్రియ చొర‌బాటుదారుల‌ను గుర్తించేందుకేన‌ని తెలిపారు.

అంత‌కుముందు, పుణెలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో షా ప్ర‌సంగించారు. యూపీఏ హ‌యాంతో పోలిస్తే మోదీ పాల‌న‌లో దేశంలో వ్య‌వ‌సాయ రంగం ఎక్కువ‌గా అభివృద్ది చెందింద‌న్నారు. కావాలంటే గ‌ణాంకాలు స‌రిచూసుకోవాల‌ని ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కు సూచించారు. బీజేపీ అంటే ఉన్న భ‌యం కార‌ణంగానే ప‌శ్చిమ బెంగాల్ లో తమ ర్యాలీల నిర్వ‌హ‌ణ‌కు మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని షా విమ‌ర్శించారు. అయోధ్యలో రామ‌మందిర నిర్మాణానికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎస్పీ-బీఎస్పీ కూట‌మిని చిత్తుగా ఓడించి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 74 లోక్ స‌భ స్థానాల‌ను ద‌క్కించుకుంటామ‌ని షా ధీమా వ్య‌క్తం చేశారు.