Begin typing your search above and press return to search.

ఆ 7 కంపెనీల్లో 60 వేల ఉద్యోగాలు ఔట్‌

By:  Tupaki Desk   |   12 May 2017 6:38 AM GMT
ఆ 7 కంపెనీల్లో 60 వేల ఉద్యోగాలు ఔట్‌
X
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఉద్యోగం కల కలగానే మిగిలిపోనుందా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమయ్యే అవకాశాలున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆకాశంలో విహరించిన ఐటీ ఉద్యోగులకు సంస్థలు పింక్‌ స్లిప్ రూపంలో భారీ షాకిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద సంస్థలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుత సంవత్సరంలో టాప్-7 సంస్థలు 58 వేల మంది ఉద్యోగులను తొలిగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఉద్యోగుల తొలిగించనున్న సంస్థల్లో ఇన్ఫోసిస్‌ తో పాటు విప్రో - టెక్ మహీంద్రా - హెచ్‌ సీఎల్ టెక్నాలజీస్ - అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ - డీఎక్స్‌సీ టెక్నాలజీ - ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్‌ జెమినీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల్లో 12 లక్షల మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా, వీరిలో 4.7 శాతం మంది సిబ్బందిపై వేటు వేయాలని యోచిస్తున్నాయి. అంటే సుమారు 60 వేల ఉద్యోగాలు అన్నమాట.

పశ్చిమ దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులు - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలకు తోడు ఆటోమేషన్..దేశీయ ఐటీ నిపుణుల - విద్యార్థుల భవిష్యత్తుపై ముప్పెట దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థల్లో సిబ్బంది తొలగింపు ప్రక్రియ ప్రారంభమవగా, మరికొన్ని సంస్థలు ఈ ఏడాది చివర్లో చర్యలను ఆరంభించనున్నాయి. హెచ్‌ పీలో విలీనమైన డీఎక్స్‌ సీ టెక్నాలజీ వచ్చే మూడేళ్ల‌లో కార్యాలయాల సంఖ్యను 50 నుంచి 26కి కుదించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది సంఖ్యను 5.7 శాతం లేదా 10 వేలు కోత పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంస్థలో 1.75 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల తొలిగింపుపై కంపెనీ వర్గాలు సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. నైపుణ్యం లేని సిబ్బందిని మాత్రమే తీసేస్తున్నట్లు కాగ్నిజెట్ - విప్రో మానవ వనరుల విభాగ వర్గాలు వెల్లడించాయి.

ప్రతియేటా నైపుణ్యం లేని 1-1.5 శాతం మంది సిబ్బంది ఆయా సంస్థలకు గుడ్‌ బై పలుకుతున్నారని, అదే విదేశీ సంస్థల విషయానికి వస్తే ఇది 3 శాతంగా ఉంది. ఈ ఏడాది మాత్రం ఇది 2-6 శాతం మధ్యలో ఉండనుందని ప్రాథమిక అంచనా. 3.90 లక్షల మంది సిబ్బంది కలిగివున్న టీసీఎస్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సిబ్బందిని తొలిగించినట్లు కానీ వెల్లడించలేదు. ఐదేళ్ల క్రితం 50 మంది చేసే పని ప్రస్తుతం ఒక్కరు చేస్తున్నారని, ముఖ్యంగా డిజిటలైజేషన్ అందుబాటులోకి రావడం ఇందుకు కారణమని యూఎస్‌ కు చెందిన హెచ్‌ ఎఫ్‌ ఎస్ రీసర్చ్ సీఈవో ఫిల్ ఫెర్చ్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/