Begin typing your search above and press return to search.

'దొంగ' పెళ్లి కూతురు

By:  Tupaki Desk   |   20 March 2015 9:42 AM GMT
దొంగ పెళ్లి కూతురు
X
లోకం మారిపోయింది... మోసం చేయడానికి అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నారు.. పాపం ఇలాంటివి తెలియని ఓ రిటైర్డ్‌ ఉద్యోగి అడ్డంగా బుక్కయిపోయి సంపాదించిందంతా పోగొట్టుకోబోయి తృటిలో బయటపడి లబోదిబోమంటున్నాడు.. భార్య విడిపోవడం.. తాను పదవీ విరమణ చేయడంతో ఏమీ తోచక, ఒంటరి జీవితానికి తోడుంటే బాగుందని భావించిన చెన్నైలోని ఓ వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది. మార్చేయడమంటూ మామూలుగా కాదు... దెబ్బలు తిని.. ఉన్నదంతా పోగొట్టుకున్న పరిస్థితి తెచ్చింది.

చెన్నైకి చెందిన రామ్మూర్తి రిటైర్డ్‌ ఉద్యోగి.. ఆయన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఒంటరితనంతో బాధపడుతూ వృద్ధాప్యంలో తోడుంటే బాగుంటుందని అనుకుని పేపర్లో పెళ్లి ప్రకటన ఇచ్చారు.. అది చూసిన వైష్ణవి అనే 35 ఏళ్ల మహిళ ఆయనకు ఫోన్‌ చేసి కోయంబేడు బస్టాప్‌కు రమ్మంది.. పాపం ప్రమాదాన్ని పసిగట్టలేని రామ్మూర్తి అమాయకంగా అక్కడకు వెళ్లాడు. రామ్మూర్తి, వైష్ణవి మాటలు ప్రారంభించిన నిమిషాల్లోనే నలుగురు కుర్రాళ్లు ఆయన్ను చుట్టుముట్టారు.. వైష్ణవి, ఆ నలుగురు కుర్రాళ్లు రామ్మూర్తిని అమాంతం ఎత్తి కారులో కుదేశారు. రెండు రోజులపాటు ఆయన్ను భయపెడుతూ చెన్నై అంతా తిప్పి చివరకు ఓ ఏటీఎం వద్దకు తీసుకెళ్లి.. 'నీ అకౌంట్‌లోని ఉన్న 35 లక్షలూ తీసివ్వు'' అని బెదిరించారు.

అయితే, అప్పటికే తీవ్రమైన భయంతో ఉన్న రామ్మూర్తి అవకాశాన్ని వినియోగించుకోవడంలో మాత్రం కాస్త తెలివిగా వ్యవహరించాడు. ఏటీఎంలో దూరి తాను కిడ్పాపైన సంగతిని బ్యాంకు అధికారులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు చెప్పడం.. వారు ఏటీఎం వద్దకు చేరుకోవడం జరిగిపోయాయి.. ఊహించని దెబ్బకు షాకైన దొంగ పెళ్లి కూతురు వైష్ణవి, ఆమె ముఠా వెంటనే పారిపోయారు. రామ్మూర్తి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు... పెళ్లి ఆలోచన నుంచి కూడా ఆయన బయటపడ్డాడని సమాచారం.