Begin typing your search above and press return to search.

ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన మోడీ

By:  Tupaki Desk   |   1 May 2016 4:26 AM GMT
ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన మోడీ
X
రెండేళ్ల క్రితం కోటి ఆశలతో దేశ ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానిని చేశారు. ఆయన కానీ అధికారంలోకి వచ్చేస్తే చాలానే మారిపోతుందని భావించారు. మోడీ లాంటోడు ప్రధాని సీట్లో కూర్చుంటే నా సామిరంగా అనుకున్నోళ్లు చాలామందే ఉన్నారు. వారు అనుకున్నట్లే మోడీ ప్రధాని అయ్యారు. ఆయన ఆ పదవిని చేపట్టి రెండేళ్లు అవుతోంది కూడా. మరి.. ప్రధానిగా మోడీ పని తీరు ఎలా ఉంది? ఆయన మీద దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలు.. ఆకాంక్షలు ఎంతమేరకు ఫలించాయి? ఆయన చేతికి అధికారపగ్గాలు వచ్చిన తర్వాత దేశాభివృద్ధిలో ఏమైనా మార్పు వచ్చిందా? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికే ప్రయత్నం చేసింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. దేశంలోని 16 రాష్ట్రాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. సీఎంఎస్ ఛైర్మన్ భాస్కర్ రావు మోడీ పని తీరు మీద తాము చేపట్టిన సర్వే ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. దీని ప్రకారం మోడీ పని తీరు ఎలా ఉందన్న విషయానికి ఆయనేం చెప్పారంటే..

= మెజార్టీ ప్రజలు మోడీ సర్కారు అభివృద్ధి కార్యక్రమాల్ని చేప్టటిందని భావిస్తున్నారు.

= మోడీ పని తీరును ఐదు పాయింట్ల స్కేల్ మీద మార్కులు ఇవ్వమని కోరితే.. 30 శాతం మంది ఐదుకు ఐదు మార్కులు వేసేశారు. 32 శాతం మంది 4 మార్కులు వేస్తే.. 20 శాతం మంది 3 శాతం మార్కులు.. 7 శాతం మంది మాత్రం ఒక్క మార్కు ఇచ్చారు.

= మోడీని ఐదేళ్లకు మించి ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారా అంటే.. అవునని సమాధానమిచ్చినోళ్లు 70 శాతం మంది. కేవలం 30 శాతం మంది మాత్రమే కొత్త ప్రధానిని చూడాలనుకుంటున్నట్లుగా వెల్లడించారు.

= మోడీ పని తీరు చాలా బాగుందని మెజార్టీ వర్గం అభిప్రాయపడింది.

= అదే సమయంలో రెండేళ్ల క్రితం ఉన్న ప్రభుత్వానికి.. మోడీ సర్కారుకు మధ్య వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదని 49 శాతం మంది వెల్లడించటం గమనార్హం.

= మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ప్రయోజనకరంగా ఉండట్లేదని 43 శాతం మంది చెప్పారు.

= మోడీ సర్కారు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుందన్న మాటను కేవలం మూడింట ఒక వంతు మాత్రమే అభిప్రాయపడగా.. హామీలు పాక్షికంగా అమలు అయినట్లుగా 48 శాతం మంది పేర్కొనటం గమనార్హం.

= ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామన్న హామీని నెరవేర్చలేకపోయారని 32 శాతం మంది అభిప్రాయ పడగా.. ఉద్యోగాల విషయంలో విఫలమయ్యారని 29 శాతం మంది.. నల్లధనాన్ని వెనక్కి తేవటంలో ఫెయిల్ అయినట్లుగా 26 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

= అవినీతి పెరిగిందని లేదంటే.. యథాస్థితిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన వారు 56 శాతం మంది కావటం గమనార్హం.

= మోడీ ‘మన్ కీ బాత్’ ను కనీసం ఒక్కసారైనా విన్నవారు 57 శాతం మంది అని.. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది.

= మోడీ సర్కారు సక్సెస్ సాధించిన పథకాల్లో జన్ ధనయోజన అని 36 శాతం మంది.. స్వచ్ఛభారత్ మిషన్ కు 32 శాతం మంది ఓటేస్తే.. విదేశీ పెట్టుబడులు అని 23 శాతం మంది చెప్పటం గమనార్హం.