Begin typing your search above and press return to search.

ఒక అసెంబ్లీ స్థానంలో 64 వేల ఓట్ల తొల‌గిస్తారా?

By:  Tupaki Desk   |   16 Sep 2018 8:53 AM GMT
ఒక అసెంబ్లీ స్థానంలో 64 వేల ఓట్ల తొల‌గిస్తారా?
X
అన్నీ సాఫీగా జ‌రిగితే మ‌రో 9 నెల‌ల్లో ఏపీలో కూడా సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపున‌కు అన్ని పార్టీలు ఎత్తులుపైఎత్తులు...వ్యూహ‌ ప్ర‌తివ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి బ‌లంగా వీస్తోంద‌ని జాతీయ‌స్థాయి స‌ర్వేలు కూడా నొక్కి వ‌క్కాణిస్తున్నాయి. ఆ గాలి తీవ్ర‌త‌కు సైకిల్ కుదేల‌వుతుందేమోనన్న బెంగ అధికార టీడీపీకి ప‌ట్టుకుంద‌ని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందుకే - వైసీపీని - జ‌గ‌న్ ను ఎదుర్కొనే క్ర‌మంలో అధికార‌ పార్టీ ...అడ్డ‌దారుల తొక్కుతోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. నేరుగా వైసీపీని ఢీకొట్ట‌లేక‌....రాష్ట్ర వ్యాప్తంగా కొంత‌మంది ఓట్ల‌ను టీడీపీ తొలగిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఓట‌ర్ల‌ జాబితా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తయారవుతోందని - త‌మకు ప్ర‌తికూల‌ ఓట్లను తొలగించి కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికే శ్రీ‌కారం చుట్టార‌ని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే వ్య‌వ‌హారం పై ఇప్ప‌టికే ఈసీకి వైసీపీ నేత‌లు ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదు సంగ‌తి ఎలా ఉన్నా....ప్ర‌స్తుతం అనంతపురం జిల్లా అర్బన్‌ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు సంచ‌ల‌నం రేపుతోంది. ఆ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే 64 వేల ఓట్లు తొల‌గించారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

సాధారణంగా ఎన్నిక‌ల‌కు ముందు ఓట‌ర్ల జాబితాలో స‌వ‌ర‌ణ‌లు...మార్పులు చేర్పులు చేయ‌డం స‌హజం. రెండు చోట్ల ఓట్లు క‌లిగిన వారిని తీసేయ‌డం...న‌కిలీ ఓట్ల‌ను తీసేయ‌డం సాధార‌ణం. అయితే, ఒక్క అనంత‌పురం అర్బ‌న్ నియోజకవర్గంలో ఏకంగా 64 వేల ఓట్లను తొలగించడం మాత్రం సాధార‌ణం కాదు. గత ఎన్నికల్లో ఓటు హ‌క్కు ఉన్న చాలామంది ఈ 64వేల జాబితాలో ఉన్నారు. దీంతో - 2,54,236 మంది ఓటర్లు కాస్తా 1,89,644 మంది అయ్యారు. అయితే, ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని ప్ర‌తికూల ఓట్లు తొల‌గిస్తే....రాష్ట్రంలోని మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఏమిటని వైసీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌త్యేకించి ఓ సామాజిక వర్గం ఓట్లను టార్గెట్ చేశార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వైసీపీని బ‌ల‌ప‌రిచే ముస్లింల ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే, ప్ర‌తిసారీ ఎన్నిక‌లకు రెండు మూడు రోజుల ముందు ఈ తొల‌గింపు వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌స్తుంది. కానీ, ఈ సారి మాత్రం ముందుచూపుతో చాలా ఓట్ల‌ను తొల‌గించారు. మ‌రి, ఈ వ్య‌వ‌హారంపై జిల్లా క‌లెక్ట‌ర్ - ఈసీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.