Begin typing your search above and press return to search.

ఈసీ మీద రాష్ట్రపతికి వారి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   10 April 2019 5:20 AM GMT
ఈసీ మీద రాష్ట్రపతికి వారి ఫిర్యాదు
X
ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదు తెర మీదకు రాలేదంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పు పడుతూ.. మునుపెన్నడూ లేనంత అథమ స్థాయికి భారత ఎన్నికల సంఘం విశ్వసనయత దిగజారిందన్న ఆరోపణను తెర మీదకు తెచ్చిన వైనం షాకింగ్ గా మారింది. ఈ తీవ్ర వ్యాఖ్య రాజకీయ పార్టీల నోటి నుంచి రాలేదు. కీలక పదవులు చేపట్టి.. పదవీ విరమణ పొందిన 66మంది మాజీ ఉన్నతాధికారులు కలిసి చేసిన ఆరోపణలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

ఈసీ విశ్వసనీయత గతంలో ఎప్పుడూ లేనంతగా దిగజారినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. భారీ సవాళ్లను ఎదుర్కొంటూనే.. స్వేచ్ఛగా.. పాదర్శకంగా ఎన్నికలు నిర్వహించటంలో చక్కటి ట్రాక్ రికార్డు ఉన్న ఈసీ ప్రస్తుతం అందుకుభిన్నంగా వ్యవహరిస్తోందన్న ఘాటు ఆరోపణను చేశారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు లేఖను 66 మంది మాజీ ఉన్నతాధికారులు రాష్ట్రపతికి రాయటం చర్చనీయాంశంగా మారింది.

ఏశాట్ క్షిపణి ప్రయోగం విజయవంతం కావటంపై జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించటం.. మోడీ బయోపిక్.. మోడీ గొప్పతనాన్ని కీర్తించే వెబ్ సిరీస్ విడుదల.. నమో టీవీ ఛానల్ అంశాలతో పాటు.. యూపీ ముఖ్యమంత్రి యోగి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు పలు అంశాల్ని వారు ప్రస్తావించారు. ఇలా కీలక స్థానాల్లో పని చేసిన అధికారులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 11న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మోడీ బయోపిక్ కు ఈసీ అభ్యంతరం చెప్పకపోవటం ఏమిటని వారు ప్రశ్నించారు.

ఈ చిత్ర నిర్మాణం.. పంపిణీ.. ప్రచారం లాంటి ఖర్చులను మోడీ ఎన్నికల వ్యయంలో కలపాలని వారు డిమాండ్ చేశారు. ఒక రాజకీయ నేత దొడ్డిదారి గుండా ఉచితంగా ప్రచారాన్ని పొందటమా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి.. రాష్ట్రపతి వీరి ఫిర్యాదు లేఖపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి