Begin typing your search above and press return to search.

ఏపీలో 68 పాజిటివ్‌ - హైద‌రాబాద్‌ లో మోగుతున్న డేంజ‌ర్ బెల్స్‌!

By:  Tupaki Desk   |   27 May 2020 8:15 AM GMT
ఏపీలో 68 పాజిటివ్‌ - హైద‌రాబాద్‌ లో మోగుతున్న డేంజ‌ర్ బెల్స్‌!
X
మహమ్మారి వైర‌స్ తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతూనే ఉంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఇప్పుడు వైరస్ వ్యాపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో 24 గంటల్లో 68 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఒక్క‌రోజే 9,664 న‌మూనాలు పరీక్షించారు. ఇక తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో కూడా కేసులు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు హైద‌రాబాద్ డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి.

ఏపీలో తాజాగా న‌మోదైన కేసులతో కలిపి మొత్తం సంఖ్య 2,787కు చేరాయి. ఆ వైర‌స్ బారిన ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన మరో 10 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ‌య్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 816 ఉన్నాయి. మొద‌టి నుంచి ఏపీలో అత్యధికంగా కేసులు ఉన్న జిల్లాగా క‌ర్నూలు నిలుస్తోంది. ఆ జిల్లాలో మొత్తం 650కి పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ వైర‌స్‌తో మొత్తం 58 మంది చనిపోయారు. నిన్న ఒకరు మృతి చెందారు.

హైద‌రాబాద్‌లో డేంజ‌ర్ బెల్స్‌
తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో హైద‌రాబాద్‌వ్యాప్తంగా ఆ మహమ్మారి విస్తరిస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 328 కేసులు నమోదవ‌గా.. 18 మంది మృతిచెందారు. రాష్ట్రంలోనే హైద‌రాబాద్‌లో తొలిసారి మార్చి 2వ తేదీన తెలంగాణలో తొలి కేసు నమోదవ‌గా... మే 8వ తేదీ వరకు 626 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఇప్పుడు హైద‌రాబాద్‌లోని చాలా ప్రాంతాలు కంటైన్‌మెంట్ జోన్లుగా మారుతున్నాయి. మొన్న‌టివ‌ర‌కు చార్మినార్, అంబర్‌పేట, సైదాబాద్, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా ప్రాంతాలు కంటైన్‌మెంట్ జోన్లుగా ఉండ‌గా.. ఇప్పుడు సికింద్రాబాద్, ఖైరతాబాద్, అమీర్‌పేట, నాంపల్లి వంటి ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవుతుండ‌డంతో ఇప్పుడు ఆ ప్రాంతాలు కూడా కంటైన్‌మెంట్ జోన్లుగా మారాయి.