Begin typing your search above and press return to search.

ఆ మంత్రి 6,889 కోట్లు.. ఆ మంత్రి 1,700 కోట్లు అవినీతి నిజమేనా?

By:  Tupaki Desk   |   9 April 2022 11:30 AM GMT
ఆ మంత్రి 6,889 కోట్లు.. ఆ మంత్రి 1,700 కోట్లు అవినీతి నిజమేనా?
X
రాజకీయాల్లో ఆరోపణలు సహజం. గతంలో పార్టీల విధానాలు, కార్యక్రమాల మీద విమర్శలు ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్త్లల్లో అయితే అవతలి పార్టీల వ్యవహార శైలిని ప్రత్యర్థులు అన్ని కోణాల్లో పరిశీలించేవారు. ఆఖరికి అంతర్జాతీయ వ్యవహారాల నుంచి జాతీయ విధానాల వరకు పార్టీల ధోరణులను గమనించేవారు. అందులో ఏమాత్రం తేడాలున్నా రాజకీయ వేదికల మీద రచ్చకెక్కించేవారు. అసలు వ్యక్తిగత విమర్శల ప్రస్తావనే ఉండేది కాదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేసినా అదో పెద్ద నేరంగా భావించేవారు. ఇప్పుడు మాత్రం అదేమీ లేకపోయింది. రాజకీయం, వ్యక్తిగతం అన్నీ కలిసిపోయాయి.

ఏపీలో ఆ ఇద్దరు మంత్రులపై ఏపీ మంత్రివర్గం మొత్తం ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిలో సీనియర్లు కొందరిని తీసుకుంటారని అంటున్నారు. జూనియర్లు మాత్రం ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇద్దరు సీనియర్ మంత్రులపై టీడీపీ గురిపెట్టినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండు రోజుల నుంచి ఆ మంత్రులపై అవినీతి ఆరోపణలు చేయిస్తోంది. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సీఎం జగన్‌ అక్రమార్జన లావాదేవీలన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు.

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన బోండా విమర్శలను తేలిగ్గా కొట్టిపారేయలేం. ఏదో వ్యూహం ప్రకారమే వీటిని చేసి ఉంటారని భావించాలి. మంత్రిగా పెద్దిరెడ్డి రూ.6,889కోట్లు దోచుకున్నారని బోండా ఆరోపించారు. జే గ్యాంగ్‌లో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి అని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బొండా ఉమ మీడియాతో మాట్లాడారు. మద్యం, మైనింగ్‌, ఇసుక మాఫియా వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ఉన్నారన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ భూదోపిడీకి కేంద్రం పెద్దిరెడ్డే అని విమర్శించారు. ఈ స్థాయిలో దోపిడీ చేసిన వ్యక్తిని కేబినెట్‌లో కొనసాగిస్తారా అంటూ బొండా నిలదీశారు.

ఎమ్మెల్య బాలవీరాంజనేయులు ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసుకున్నారు ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి. జగన్ కేబినెట్ లో అవినీతి బాహుబలి బాలినేని అని విమర్శించారు. ఆయన రూ.1,734 కోట్లు దోచేశారని మండిపడ్డారు. ఇది కూడా "జె" ట్యాక్స్ ఖాతా కిందకే కట్టారు. లెటర్ హెడ్ల కుంభకోణం మొదలు నేడు రాష్ట్రం అంధకారమయం కావడానికి బాలినేనినే కారణమని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సహా పలు మైనింగ్ లలో అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బాలినేని కారులో రూ.5 కోట్ల హవాలా డబ్బు బయటపడినా సీఎం జగన్ చర్యలు తీసుకోలేదని అన్నారు.

అంతా ఆరోపణనేనా? అవినీతి నిజమేనా? భారీ అవినీతి ఆరోపణలు చేయడంలో టీడీపీ మొదటినుంచి పెట్టింది పేరు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అయితే ఇవి పతాక స్థాయిలో ఉండేవి. వైఎస్ సంపాదన గంటకు రూ.2కోట్లని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపించారు. దీనిని పెద్దఎత్తున ప్రజల్లోకి కూడా తీసుకెళ్లారు. అది వాస్తవమా? కాదా? అనేది పక్కనపెడితే ఆరోపణను అయితే గాలిలోకి వదలడం రాజకీయ పార్టీల నైజం. అయితే, వైఎస్ పై చేసిన ఆరోపణలు పెద్దగా చర్చనీయాంశం అయినా.. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపలేదు.

2009 ఎన్నికల్లో ఆయన అద్భుత విజయంతో రెండోసారి సీఎం అయ్యారు. తాజా ఆరోపణల విషయానికొస్తే వైసీపీ మాజీ మంత్రులను టీడీపీ టార్గెట్ చేసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇద్దరిపై వేల కోట్ల లోనే అవినీతి ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశం ప్రభుత్వం తీరుపై చర్చ జరగాలని కోరుకోవడంగా అర్థమవుతోంది. మరోవైపు ఈ ఆరోపణలకు వారు కొన్ని ప్రాతిపదికలూ చూపుతున్నారు. బోండా ఉమా అయితే కొన్ని కాగితాలను ప్రదర్శించారు. వాస్తవానికి సరైన విచారణ జరిపితే ఇందులో వాస్తవం పాలు ఎంతో తెలిసిపోతుంది. రాజకీయ ప్రత్యర్థులు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయకుండా ముకుతాడు వేసినట్లవుతుంది. ప్రజలకు కూడా వాస్తవాలు ఏవో, ఆరోపణలు ఏవో బోధపడతాయి.